ఇందిరమ్మ ఇళ్లకు లభించని మోక్షం
ఇప్పటికే గ్రామసభలు పూర్తి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ముందుకెళ్తోంది. దీంట్లో భాగంగా జనవరి 26నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులను ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సమయంలో 3,09,062 మంది దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 26 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామసభల్లో దరఖాస్తుదారుల పేర్లు చదివి వినిపించారు. జాబితాలో పేర్లు రానివారి నుంచి కొత్తగా మరో 28,225 దరఖాస్తులు స్వీకరించారు. పైలట్ పథకం కింద జిల్లాలోని 23 మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించగా.. జిల్లాలో 4,140 మంది అర్హులుగా తేల్చారు.
భానుపురి (సూర్యాపేట): ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల సాకారం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. దరఖాస్తుల నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాళ్లు ఎప్పుడు పడతాయోనని లబ్ధిదారులు కొండంత ఆశతో నిరీక్షిస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారుల గుర్తింపు పూర్తయి.. తీరా ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసే సమయానికి నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసి పదిరోజులు అవుతున్నా ఈ పథకం అమలుపై ఇటు అధికారులు, అటు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
కోడ్ కూసి.. పథకం నిలిచి..
ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారుల గుర్తింపు పూర్తవ్వగా.. మిగిలిన గ్రామాల్లో అర్హుల గుర్తింపునకు చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ఎల్–1 కింద స్థలం ఉండి ఇళ్లు లేనివారు, ఎల్–2 కింద సొంతభూమి లేని వారిని, ఎల్–3 కింద అద్దెకు ఉండడం, సొంత ఇళ్లు ఉండి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారీగా గుర్తించి ఆయా జాబితాలో చేర్చాల్సి ఉంది. మొదటగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభాల్సి ఉంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారికి సమాచారం ఇచ్చి ముగ్గు పోయాల్సి ఉంది. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో పథకం అమలు నిలిచిపోయింది. మార్చి 3న కౌంటర్ జరిగి కోడ్ ముగిసి ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఈ పథకంపై ఊసెత్తిన దాఖలాలు లేవు. దీంతో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు, ఇతర ప్రాంతాల్లో అర్హులు ఇళ్ల పథకం అమలు కోసం వేయి కళ్లలో ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద అసలు ఇళ్లు మంజూరవుతాయా.. లేదా అని లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
ఫ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినా ఊసెత్తని అధికారులు
ఫ నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోని పథకం
ఫ అయోమయంలో లబ్ధిదారులు