మాట్లాడుతున్న పళణిస్వామి
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో రూ. 30 వేల కోట్లు కొల్లగొట్టిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆరోపించారు. రాష్ట్రం హత్యలతో అట్టుడుకుతోందని , రోజుకు కనీసం ఆరేడు హత్య ఘటనలు చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆదివారం చైన్నె నుంచి సేలంకు పళణి స్వామి వెళ్లారు. ఆయనకు కొంగనాపురంలో పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పాలనలో తాము తీసుకొచ్చిన ప్రాజెక్టులు, అనేక పనులు ప్రస్తుతం ముగిశాయని, వాటిని డీఎంకే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినట్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సేలం జిల్లాను పూర్తిగా ఈ పాలకులు విస్మరించారని, తాను ఈ జిల్లా వాడిననే కారణంతో ఇక్కడి ప్రజలపై సవతి తల్లి ప్రేమను డీఎంకే పాలకులు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే పాలకులు కొత్త చేపట్టిన పనులు ఏ ఒక్కటీ లేవని, కపట నాటకాలు, కళ్లబొల్లి మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రోజుకు ఆరేడు హత్య ఘటనలు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయని వివరించారు. యువత మత్తుకు బానిసయ్యే విధంగా గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలు రాష్ట్రంలో జోరందుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం క్రీడా మైదానాలు, కల్యాణ వేదికలలోకి మద్యం సరఫరా అంటూ , రాష్ట్రాన్ని మత్తులో ముంచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచిత్ర పాలన సాగుతోందని, ఈ అసమర్థ సీఎం కారణంగా ప్రజలు మున్ముందు అష్టకష్టాలు పడే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయన్నారు. రెండేళ్ల పాలనలో రూ. 30 వేల కోట్లను మింగేశారని ఆరోపించారు. పాలకుల అవినీతి అక్రమాలపై ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ చేసినట్టుగా ప్రచారంలో ఉన్న ఆడియో గురించి సీఎం స్టాలిన్ స్పందించక పోవడం శోచనీయమని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment