
తెల్ల చొక్కా, తెల్ల పంచె, నుదుటున విభూదితో కనిపించే పళణి స్వామి ప్రస్థానం తమిళ రాజకీయాల్లో ప్రత్యేకమనే చెప్పాలి. 1954లో సేలం జిల్లా శిలువం పాళయం అనే గ్రామంలో ఆయన జన్మించారు. కోనేటి పట్టిలో బెల్లం వ్యాపారంలో రాణించారు. ఎంజీఆర్ మరణంతో అన్నాడీఎంకే ముక్కలైన సమయంలో 1989లో జయలలిత శిబిరం ఎమ్మెల్యేగా ఎడపాడి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలుపొందారు. అప్పటి నుంచి ఎడపాడి ఆయన ఇంటి పేరుగా మారింది. పార్టీ జిల్లా కార్యదర్శిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయాలతో దూసుకొచ్చిన పళణి స్వామి 2011లో తొలిసారి మంత్రి అయ్యారు.
2016లో మరో మారు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో అనూహ్యంగా పళణి స్వామి శాసన సభ పక్ష నేతగా మారారు. జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తూ, తన ప్రతినిధిగా పళని స్వామిని ఏకంగా సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తదుపరి పళనిస్వామి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ, ఎత్తుకు పై ఎత్తులతో శశికళ శిబిరాన్నే పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పన్నీరు సెల్వంను అక్కున చేర్చుకుని జంట నాయకత్వంతో ముందుకెళ్లారు.
ఎంత కాలం ఈ ప్రభుత్వం కొనసాగుతుందో అని అనుమానం వ్యక్తం చేసిన వారికి తన మార్కు పాలనతో సమాధానం చెప్పారు. ప్రజల మన్ననలే కాదు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నాయకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు అధికారం దూరమైనా, గౌరవప్రదంగా 65కు పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకుని తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా పగ్గాలు చేపట్టి.. తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక చివరికి అన్నాడీఎంకేలో తిరుగు లేని నేతగా మారి జయలలిత తర్వాత ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు.
:: సాక్షి, చైన్నె ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment