పన్నీరు సెల్వం, అమిత్ షా, పళణి స్వామి (ఫైల్)
అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వంకు మరో షాక్ తగిలింది. ఆధిపత్య పోరులో తనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. ఓపీఎస్‌కు హ్యాండిచ్చే విధంగా ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోబోమని, ఇది వారి వ్యక్తిగతం అని అమిత్ షా స్పష్టం చేయడం పన్నీరు శిబిరాన్ని కలవరంలో పడేసింది.
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, న్యాయ పోరాటం, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పళణి స్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తె చ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి ఢి ల్లీ వెళ్లిన ఆయన అక్కడి పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. అదే సమయంలో కేంద్రం తనకు అనుకూలంగా ఉంటుందని, వారి ద్వారా పళని స్వామికి చెక్ పెట్టవచ్చనున్న ధీమాతో ఆ పార్టీ సమన్వయ కమిటీ పన్నీరు సెల్వం ఉంటూ వస్తున్నారు.
చర్చకు ముగింపు..
ఢిల్లీ పర్యటన సందర్భంగా పళని స్వామికి అమిత్ షా హిత బోధ చేసినట్టు పన్నీరు సెల్వంతో పాటుగా మిగిలిన వారిని కలుపుకుని వెళ్లాలని క్లాస్ తీసుకున్నట్లుగా కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై పెద్దఎత్తు చర్చలు సాగడంతో పన్నీరు శిబిరంలో ఆనందడోలికల్లో తేలింది. కేంద్రం ద్వారా మళ్లీ అన్నాడీఎంకేను కై వసం చేసుకోవచ్చనే ధీమాతో తన బలాన్ని చాటే ప్రయత్నాలను పన్నీరు వేగవంతం చేశారు.
అలాగే కేంద్రం ద్వారా పళణి స్వామితో రాయబారాలు జరపడం లేదా, కోర్టు తుది తీర్పు వ్యవహారంలో కేంద్రాన్ని ఆశ్రయించడం వంటి ఎత్తుగడలతో పన్నీరు ముందుకెళ్లారు. అయితే ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. పన్నీరు శిబిరానికి పెద్ద షాక్ ఇచ్చే విధంగా , తాజాగా జరుగుతున్న చర్చకు ముగింపు పలికే రీతిలో బెంగళూరులో అమిత్ షా ఓ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు.
జోక్యం చేసుకోం..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడీఎంకే అంతర్గాత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అది వారి అంతర్గత వ్యవహారం, ఇందులో ఒకరిపై ఒత్తిడి తీసుకు రావాల్సినంత అవసరం తమకు లేదన్నారు. వారి మధ్య సమస్యలు, వివాదాలను వాళ్లే పరిష్కరించుకోవాలే గానీ మధ్యవర్తులు ఉండ కూడదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. పన్నీరు సెల్వం వ్యవహారంలో అన్నాడీఎంకేనే నిర్ణయం తీసుకోవాలి. తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆయన చర్చకు ముగింపు పలికారు. ఈ వ్యాఖ్యలు పన్నీరు సెల్వం శిబిరాన్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో పళని స్వామి శిబిరంలో జోష్‌ను నింపింది.
వందే భారత్‌లో పళణి
అమిత్ షా వ్యాఖ్యలు ఉదయాన్నే పళణి శిబిరంలో జోష్‌ను నింపాయి. ఇదే ఊపులో పళణి స్వామి ఆనందంగా వందే భారత్ రైలులో ప్రయాణించారు. సేలం నుంచి ఆయన వందే భారత్ రైలులో పర్యటించారు. ఈ సమయంలో ఆయనతో అనేక మంది ప్రయాణికులు సెల్పీలు దిగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment