
సాక్షి, చైన్నె: కొత్త టెర్మినల్‌లో రాత్రి సమయాల్లోనూ విమాన సేవలకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు జరిగిన ట్రైల్ రన్ విజయవంతమైంది. వివరాలు.. చైన్నె విమానాశ్రయాన్ని అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కంబైన్డ్ టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అదే నెల 25వ తేదీ నుంచి ఈ టెర్మినల్ ద్వారా అంతర్జాతీయ విమాన సేవలకు శ్రీకారం చుట్టారు. తొలి విమానం బంగ్లా దేశ్ నుంచి ఇక్కడకు వచ్చి మళ్లీ తిరుగు ప్రయాణమైంది.
ప్రయాణికుల తనిఖీలకు వంద, కస్టమ్స్, ఇమిగ్రేషన్ తదితర తనిఖీల కోసం మరో 108 కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. కన్వేయర్ బెల్ట్‌లు, ఎక్సలేటర్లు, వాక్ లేటర్లు తదితర హంగులతో బ్రహ్మాండంగా ఈ టెర్మినల్ రూపుదిద్దుకుంది. విమానాలు ఆగేందుకు, ప్రయాణికుల టాక్సీ సేవలు అంటూ మరెన్నో ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు. ఈనెల 3 వతేదీ నుంచి ట్రైల్ రన్‌గా సింగపూర్, కువైట్ తదితర దేశాల విమానాలు ఈ టెర్మినల్ దావరా టేకాఫ్, ల్యాండింగ్ చేశాయి. అలాగే చిన్న రకం విమానాలు ఎయిర్ బస్, బోయింగ్ తదితర విమమానాలు టేకాఫ్ తీసుకున్నాయి.
ప్రయోగాత్మకంగా..
ఈ టెర్మినల్ ద్వారా ప్రయోగాత్మకంగా ఉదయం వేళల్లో మాత్రం విమాన సేవలు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రాత్రుల్లో సైతం విమాన సేవలకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువ జాము వరకు ప్రయోగాత్మకంగా ఈ టెర్మినల్ నుంచి విమానాల టేకాఫ్ తీసుకున్నాయి. ఎలంక, కువైట్, ఇథియోఫియా దేశాలకు విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఈ వారం మొత్తం రాత్రులలో ట్రైల్ రన్ నిర్వహించనున్నారు. అనంతరం జూన్ మొదటివారం నుంచి ఈ కొత్త టెర్మినల్‌ను పూర్తి స్థాయిలో ప్రయాణికుల ఉపయోగంలోకి తీసుకు రానుందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment