సాక్షి, చైన్నె: చైన్నె నుంచి షాలిమర్ వైపుగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రెండురోజుల అనంతరం పట్టాలెక్కింది. ఈ రైలు మంగళవారం షాలిమర్‌కు చేరుకోనుంది. వివరాలు.. ఒడిశా బాలసోర్ వద్ద శుక్రవారం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, హౌరా ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొన్న దుర్గటనతో చైన్నె నుంచి అనేక రైళ్ల సేవలు రద్దు చేశారు. ఈ ప్రమాదంలో తమిళులు పెద్దసంఖ్యలో చిక్కుకున్నట్టుగా వచ్చిన సమాచారంతో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో తమిళులు ఎవరూ మరణించలేదు.
స్వల్పగాయాలతో బయట పడ్డ వాళ్లే అధికం. అందరూ సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించడంతో మళ్లీ రైళ్ల సేవలపై అధికారులు దృష్టి పెట్టారు. దీంతో చైన్నె నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపుగా వెళ్లే పలు రైళ్లు సేవలను సోమవారం పునరుద్ధరించారు. అలాగే రెండురోజులుగా పూర్తిగా నిలుపుదల చేసిన చైన్నె – షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లీ ప్రారంభించారు.
ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలు దేరే సమాచారాన్ని మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. దీంతో ఈ రైలు సోమవారం ఉదయం చైన్నె ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 10.45 గంటలకు బయలు దేరింది. ఈ రైలు విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం మీదుగా బాలాసోర్ వైపుగా కోలకతాలోని షాలిమర్‌కు మంగళవారం ఉదయం చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment