భువనేశ్వర్: రాష్ట్రంలో సంభవించిన ట్రిపుల్ రైలు ప్రమాదం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం వెల్లడించింది. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుకు మధ్య జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు సీబీఐకి చెందిన 10మంది సభ్యుల బృందం సోమవారం రాత్రి ఒడిశాకు చేరుకుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. రైల్వేశాఖ అభ్యర్థన మేరకు, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు వర్గం సభ్యులు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్‌పీఎస్)లో నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టిందన్నారు.
సీఆర్‌ఎస్ విచారణ..
రైలు దుర్ఘటనలో ప్రాణహాని సంభవించే పరిస్థితుల్లో రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్‌ఎస్) దర్యాప్తు చేపట్టడం నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవల బహనాఘా బజార్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ట్రిపుల్ రైలు దుర్ఘటనలో మృతులు సంభవించిన ఘటనపై సీఆర్‌ఎస్ విచారణ కోసం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా సందర్శించిన అనుబంధ అధికార, సిబ్బంది వర్గాలతో ముఖాముఖి సంప్రదించింది. ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే భద్రతా కమిషనర్ శైలేష్‌కుమార్ పాఠక్.. కొంతమంది వ్యక్తుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఇదో ఉద్దేశపూర్వక ట్యాంపరింగ్ సంఘటనగా ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేష్‌రాయ్ మీడియాతో అన్నారు.
ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పు కారణంగా రైలుప్రమాదం సంభవించిందని.. అయితే ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటైన చైన్నెకి వెళ్లే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్(ఎల్‌పీ), అసిస్టెంట్ లోకోపైలట్ వివరణ ప్రకారం గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు వెల్లడైందన్నారు. ఈ ఘటనకు వీరివురు ప్రత్యక్ష సాక్షులు. ఈ పరిస్థితుల దృష్ట్యా సిగ్నలింగ్ వ్యవస్థలో ‘ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్‘ ఉండవచ్చని డీఆర్‌ఎం సందేహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు రైల్వేబోర్డు ఆదివారం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు, పరిసరాలు, నిర్వహణ ఇతరేతర అనుబంధ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని రైల్వేబోర్డు తదుపరి విచారణ, దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ ఘటనలో 21 కోచ్‌లు ఢీకొని పట్టాలు తప్పడంతో 288 మృతులు నమోదయ్యాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.
సమ్మతించిన రాష్ట్రప్రభుత్వం
రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం సమ్మతి తెలిపింది. సీబీఐ విచారణకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి సంతకం చేసిన సమ్మతి లేఖ జారీ చేశారు. ఈనెల 2న బహనాగా బజార్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి దారితీసిన కారణాలపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం తర ఫున అదనపు చీఫ్ సెసీ(హోమ్) డీకే సింగ్ సమ్మతి తెలిపారు. ఈ ప్రమాదం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని 2 కోచ్‌లను కూడా ప్రభావితం చేసింది.
గుర్తించాల్సినవి.. 83
బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్యలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. మృతుల జాబితా విస్తృత ధ్రువీకరణ, అనుబంధ వర్గాల సమాచారం, ఘటనా స్థలం ఇతరేతర రంగాల్లో 2రౌండ్ల కూబింగ్ నిర్వహించిన అనంతరం 288మరణాలను నిర్థారించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా మంగళవారం సాయంత్రం వెల్లడించారు. 205 మృతదేహాలను గుర్తించి బంధు వర్గాలకు అప్పగించగా, మరో 83 ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. భువనేశ్వర్‌లో 110, బాలాసోర్‌లో 94, భద్రక్‌లో 1 గుర్తించిన వాటిలో ఉన్నాయి. పలు ప్రాంతాలకు మృత దేహాలను ప్రభుత్వ ఖర్చులతో తరలించారు. అయితే గుర్తించని మృతదేహాల్లో పలు సందర్భాల్లో వివాదం తలెత్తుతోంది. ఒక్కో మృతదేహం కోసం ఒకరి కంటే ఎక్కువ మంది ముందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది. వివాదం నుంచి బయట పడేందుకు సందిగ్ధ 83 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనుబంధ వర్గాల నుంచి సహాయ, సహకారాలు అభ్యర్థించారు.
రాష్ట్ర మృతులు 39..
కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో రాష్ట్రం నుంచి 39మంది ప్రయాణికులు మృతిచెందారు. వీరిలో బాలాసోర్ జిల్లా నుంచి 14, మయూర్‌భంజ్ 9, భద్రక్ 8, కటక్ 3, జాజ్‌పూర్ 2, ఖుర్దా 2, కెంజొహర్ జిల్లా నుంచి ఒకరు మృతి చెందినట్లు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటన మేరకు మృతుల కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.95 కోట్ల పరిహారం మంజూరు చేశారు. ఒక్కో మృతుని కుటంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
పరిహారం పొందడం ఇలా..
ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు రైల్వేశాఖ నష్టపరిహారం ప్రకటించింది. వాస్తవ బాధిత, పీడిత వర్గాలు ఈ పరిహారం లబ్ధిదారులు. పరిహారం పొందేందుకు దశలవారీ క్రమ విధానం ఇలా ఉంది. మృతులు, గాయపడిన వారు, గుర్తు తెలియని మృతదేహాల చిత్రాలతో కూడిన వెబ్‌సైట్ల లింక్‌లను రైల్వేశాఖ విడుదల చేసింది. మృతదేహాలను ఉంచిన ఆస్పత్రులు, చికిత్స పొందుతున్న, గాయపడిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను కూడా ఈ సైట్‌లో పేర్కొంటాయి. రైల్వేశాఖ మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఈ మొత్తంలో రూ.50వేల నగదు, రూ.9.5 లక్షల చెక్కు అందిస్తారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేస్తారు.
మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం
కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మృతుల బంధువులు, ఆత్మీయులు సులువుగా గుర్తించేందుకు పలు రకాల సన్నాహాలు చేశారు. ఈ చర్యలు అంతంత మాత్రంగా ఫలప్రదమయ్యాయి. ఇదిలా ఉండగా మృతదేహాల కోసం పలువురు ముందుకు రావడంతో పరిస్థితి మరింత బిగుసుకుంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను దీర్ఘకాలం తాజాగా ఉంచేందుకు శక్తివంతమైన కంటైనర్లు వంటి సాంకేతిక సదుపాయాలతో మృతుల వివరాలు ప్రదర్శన వంటి సన్నాహాలు చేపట్టారు. వీటిపై వివాదం తలెత్తడంతో మృతులు, బంధువర్గాల డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ప్రాంగణంలో డీఎన్‌ఏ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. 10మంది వ్యక్తులు డీఎన్‌ఏ పరీక్షలకు ముందుకు వచ్చారు. వీరిలో 5మంది పరీక్షలు పూర్తి చేసినట్లు అనుబంధ వర్గాలు తెలిపాయి.
సచివాలయ సేవాసంఘం..
బాధితుల సహాయార్థం రాష్ట్ర సచివాలయ సేవాసంఘం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు సేవాసంఘం సభ్యుల బృందం ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో సీఎస్ ప్రదీప్ జెనాతో భేటీ అయ్యారు.
బాధితులకు సాయం..
రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ఒడిశా వెటర్నరీ సర్వీసెస్ అసోసియేషన్ రూ.20 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనాకు దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు.
వెబ్‌పోర్టల్ వివరాలు:
► ఘోర ప్రమాదంలో మరణించిన వ్యక్తుల చిత్రాలను https://srcodisha.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
► వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న, గాయపడిన ప్రయాణికుల పేర్లను తెలుసుకునేందుకు https://www.bmc.gov.in
► కటక్ ఎస్సీబీ మెడికల్ కశాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోల వివరాలు ఈ క్రింది వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
► https://www.bmc.gov.in/train&accident/ download/Un&identified&person&under&treatment&atSCB&Cuttack.pdf
► ప్రభావిత వర్గలు ప్రటకించిన నష్టపరిహారం పొందేందుకు క్రమ పద్ధతిలో అనుబంధ వర్గాలను సంప్రదించాల్సి ఉంది.
► తొలుత మృతదేహం భద్రపరిచిన ఆస్పత్రిని సంప్రదించాలి. ఈ మేరకు రైల్వేశాఖ జారీ చేసిన జాబితాను పరిగణలోకి తీసుకోవాలి.
► బాధితులతో తమ సంబంధాన్ని ధ్రువీకరించే పత్రాలు దాఖలు చేయాలి.
► అభ్యర్థన మేరకు దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన మేరకు ధ్రువీకరించిన తరువాత మృతదేహాన్ని అప్పగిస్తారు.
► ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులు డిశ్చార్జి సర్టిఫికెట్ జారీ చేస్తారు.
► తదుపరి పరిహారం పొందేందుకు డిశ్చార్జ్ సర్టిఫికెట్‌తో పాటు అవసరమైన దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది.
► మృతుల రక్త సంబంధీకులకు మాత్రమే పరిహారం చెల్లిస్తారు. వివాహిత జంట(దంపతులు) విషయంలో భర్త లేదా భార్యకు మాత్రమే పరిహారం ముడుతుంది.
రైల్వే సిబ్బంది ప్రస్తావన లేదు: సీబీఐ
288 మంది మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదంలో నమోదైన ఎఫ్‌ఐఆర్ వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) లోతుగా పరిశీలించినట్లు మంగళవారం తెలిపింది. ఎఫ్‌ఐఆర్ దాఖలు సమయానికి నిర్దిష్ట రైల్వే ఉద్యోగుల నేరం నిర్థారించలేదు. తదుపరి దర్యాప్తు సమయంలో ఈ అంశం నిర్థారిస్తామని పేర్కొంది. కటక్ ఓపీఎస్ ఎస్‌డీఆర్‌పీఓ రంజిత్ నాయక్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఎస్సీబీలో ఎల్‌ఈడీ ప్రదర్శన
కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో ఎల్‌ఈడీ టీవీ ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్, సమాచార కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని బాధితుల బంధు వర్గాలు ముందుకు వచ్చేందుకు వీలుగా ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న వారి ఫొటోలను ఎల్‌ఈడీ టీవీలో ప్రదర్శిస్తున్నారు. బాధితుల వివరాలతో సమగ్ర జాబితా ఈ ప్రదర్శనలో లభ్యమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment