సాక్షి, చైన్నె: సుప్రీంకోర్టులో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలకు చుక్కెదురైంది. సెంథిల్ బాలాజీ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు బెంచ్ నిరాకరించింది. ఇదిలాఉండగా, చైన్నె కావేరి ఆస్పత్రిలో మంత్రి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతంగా ముగిసింది. వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఆయన ఉన్నారు. క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో మంత్రి సెంథిల్‌బాలాజి అరెస్టయిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలో చేరడంతో ఈడీ వర్గాలకు ముచ్చెమటలు తప్పలేదు.
ఎలాగైనా తమ కస్టడీకి తీసుకుని ఆయన్ను విచారించేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలెట్టారు. సెంఽథిల్‌ను కావేరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ నుంచి తప్పించుకునేందుకే సెంథిల్ బాలాజి ఆస్పత్రిలో చేరినట్టుందని సుప్రీంకోర్టుకు ఈడీ న్యాయవాదులు వివరించారు. ఆయనకు జరుగుతున్న చికిత్స ఓ ప్రశ్నార్థకంగా పేర్కొన్నారు. దీంతో సెంథిల్ బాలాజి తరఫు న్యాయవాదులు తమ వాదనలో ఈడీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నాలుగు చోట్ల గుండెకు వెళ్లే నాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్టు వైద్యులు తేల్చినట్టు వివరించారు. దీనిని కూడా ఈడీ వక్రీకరించే ప్రయత్నం చేయడం, అనుమానాలు వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. ఆస్పత్రిలో చికిత్సలో వ్యక్తి ఉంటే, అప్పీలుకు ఈడీ వెళ్లడం వెనుక ఆంతర్యమేమిటో అని ప్రశ్నించారు. వాదనల అనంతరం సుప్రీంకోర్టు ఈడీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అలాగే, మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఈడీకి చుక్కెదురైనట్టైంది.
విజయవంతంగా శస్త్ర చికిత్స..
బుధవారం ఉదయం కావేరి ఆస్పత్రిలో డాక్టర్ ఏఆర్ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతం చేశారు. ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి. నాళాలలో బ్లాక్‌లు అన్నీ బైపాస్ సర్జరీతో తొలగించామని, ఆయన పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు వివరించారు. కనీసం పది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సెంథిల్ ఉండాల్సిన అవసరం ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment