సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ విడుదలకు సంబంధించి మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులు ఇచ్చింది. మంత్రిని విడుదల చేయాలని జస్టిస్ నిషా భాను నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పగా.. సెంథిల్‌ను విడుదల చేయకూడదని జస్టిస్ భరత చక్రవర్తి భిన్నంగా మరో తీర్పును వెలువరించారు. దీంతో ఈ కేసును మద్రాసు కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది.
'ఈడీకి అధికారం లేదు..'
మనీ లాండరింగ్ కేసులో పోలీసు కస్టడీని కోరే అధికారం ఈడీకి ఉండదని జస్టిస్ నిషా భాను ధర్మాసనం తెలిపింది. కావున సెంథిల్ బాలాజీ భార్య మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. అంతేకాకుండా సెంథిల్ ఆస్పత్రిలో ఉన్న వ్యవధిని కస్టోడియల్ గడువు నుంచి మినహాయించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
భిన్నమైన తీర్పు..
జస్టిస్ నిషా భాను ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా జస్టిస్ భరత చక్రవర్తి తీర్పును వెలువరించారు. మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు కాదని ధర్మాసనం తెలిపింది. కేవలం అరెస్టు, నిర్బంధం చట్టవిరుద్ధమని చూపితే తప్పా హెబియస్ కార్పస్ చెల్లుబాటు కాదని వెల్లడించారు. అంతేకాకుండా కస్టోడియల్ గడువును కూడా పెంచుతున్నట్లు తీర్పును వెలువరించారు. ఆరోగ్యం బాగా లేని కారణంగా ఒక్కరోజు కూడా ఈడీ విచారణలో సెంథిల్ గడపనందున జూన్ 14 నుంచి ఇప్పటివరకు కస్టోడియల్ గడువును మినహాయింపునిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
సెంథిల్ బాలాజీ అరెస్టులో ఈడీ చట్టపరమైన విధివిధానాలు పాటించలేదని మేఘాలా కోర్టుకు విన్నవించారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు తాత్కాలికమైనదని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ఈడీ తరుపు న్యాయవాదులు.. అరెస్టుకు సంబంధించిన పంచనామాను సెంథిల్ బాలాజీ స్వీకరించలేదని తెలిపారు. సెషన్ కోర్టు రిమాండ్ ఇచ్చే క్రమంలోనే అరెస్టుకు సంబంధించిన కారణాలను సెంథిల్ బాలాజీకి వివరంగా తెలిపారని వెల్లడించారు.
మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు అక్రమమంటూ ఆయన భార్య మేఘలా జూన్ 14న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తూ కోర్టు మెట్లెక్కారు. అనారోగ్యం కారణంగా సెంథిల్ బాలాజీని కావేరీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే.. ఈడీ దర్యాప్తు నిమిత్తం సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు 8 రోజుల కస్టడీని విధించింది.
ఇదీ చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment