TN BJP Chief Post Stalin Spoke About Senthil Balaji Corruption - Sakshi
Sakshi News home page

సెంథిల్‌ బాలాజీ అవినీతిని స్టాలిన్‌ ఏకిపాడేసిన వేళ.. పాత వీడియో పోస్ట్‌ చేసిన అన్నామలై

Published Wed, Jun 14 2023 4:31 PM | Last Updated on Wed, Jun 14 2023 4:58 PM

TN BJP Chief Post Stalin spoke about Senthil Balaji corruption - Sakshi

చెన్నై: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రతీకార చర్యలకు బీజేపీ దిగుతోంది. విపక్షాలు మొదటి నుంచి బీజేపీపై చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే. అందుకు తగ్గట్లుగా తాజాగా తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేయడం.. తదనంతర నాటకీయ పరిణామాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కౌంటర్‌కు దిగింది. 

బాలాజీని ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించిన స్టాలిన్‌.. ఆయన్ని బాధితుడిగా పేర్కొనడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. గతంలో బాలాజీ అవినీతి విమర్శలు స్టాలిన్‌ చేసిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. తద్వారా స్వరం ఎందుకు మారిందంటూ స్టాలిన్‌ను నిలదీశాడు అన్నామలై.  

గతంలో క్యాష్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌లో సెంథిల్‌ బాలాజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ టైంలో ఆయన డీఎంకేలో లేరు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. స్టాలిన్‌ సహా డీఎంకే కీలక నేతలంతా బాలాజీని అవినీతిపరుడంటూ ఏకిపారేశారు ఆ టైంలో. ఇదే అన్నామలై సదరు వీడియో ద్వారా గుర్తు చేశాడు. 

కరూర్‌జిల్లాలో ఓ మంత్రి ఉన్నాడు. ఆయన పేరు సెంథిల్‌ బాలాజీ. కేబినెట్‌ ఇప్పటిదాకా 15సార్లు పునర్వ్యవస్థీకరణ అయ్యింది. కానీ, సెంథిల్‌ను మాత్రం కేబినెట్‌లో అలాగే కొనసాగించారు. ఆయనొక జూనియర్‌ మంత్రి. సీనియర్లను పక్కనపెట్టి మరీ ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. జయలలిత జైల్లో ఉన్న టైంలో.. ఆయన పేరు సీఎం పదవికి కూడా వినిపించింది. ఆయన, ఆయన సోదరుడు ఇద్దరూ జిల్లాను దోచుకునేందుకే ఉన్నారు.. ఇవీ స్టాలిన్‌ ఆ వీడియోలో చెప్పిన మాటలు. అయితే ఆ తర్వాత అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో పార్టీని వీడి..  2018లో సెంథిల్‌ బాలాజీ డీఎంకేలో చేరారు. 

విచారణకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి సెంథిల్ బాలాజీ చెప్పిన తర్వాత కూడా ఛాతిలో నొప్పి వచ్చేలా చిత్రహింసలకు గురిచేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏం సాధించాలనుకుంటోంది. కేసుకు అవసరమైన చట్టపరమైన విధానాలను ఉల్లంఘిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మానవత్వం లేని విధంగా వ్యవహరించడం అవసరమా? బీజేపీ బెదరింపులకు డీఎంకే భయపడదు. 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అంటూ సెంథిల్‌ను కలిశాక ఓ ట్వీట్‌ చేశారు ‍ స్టాలిన్‌. 

ఇదిలా ఉంటే.. చెన్నై, కోయంబత్తూరు ఇల్లు, ఇతర ప్రాంతాల్లో 18 గంటల తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన్ని అర్ధరాత్రి అరెస్ట్‌ చేసింది ఈడీ. 2011-15 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న టైంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో మనీలాండరింగ్‌ ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేసి ఈ అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించింది ఈడీ. అయితే అరెస్ట్‌ సమయంలో ఆయన ఛాతీ నొప్పితో కుప్పకూలి స్పృహ కోల్పోవడంతో  చెన్నైలోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఆయనకు బైపాస్‌ సర్జరీ అవసరమని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు కూడా. 

ఇదీ చదవండి: తమిళనాడు మం‍త్రి అరెస్ట్‌ సమయంలో జరిగింది ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement