సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా అందరి మన్ననలు పొందుతున్న ఎం షర్మిల(24) శుక్రవారం రోడ్డున పడ్డారు. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లో ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది.
కోయంబత్తూరులో బస్సు డ్రైవర్ షర్మిల ఇటీవల సెలబ్రటీ అయ్యారు. ఆమె ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు అనేక మంది మీడియా ముందుకొచ్చారు.
తాము సైతం డ్రైవింగ్ నేర్చుకుని బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రటీగా మారిన షర్మిలను అభినందించేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడే వాళ్లు మరీ ఎక్కువే. డ్రైవర్‌గా ఆమె పనితీరును పరిశీలించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం కోయంత్తూరుకు వచ్చారు.
కండక్టర్ తీరుతో..
షర్మిల నడిపే బస్సులో ఇదివరకు ఉన్న మగ కండక్టర్‌ను తొలగించి శుక్రవారం నుంచి కొత్తగా లేడీ కండక్టర్‌ను ఆ ట్రావెల్స్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే, ఆ లేడీ కండక్టర్ రూపంలో షర్మిలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
తన బస్సులోకి హఠాత్తుగా కనిమొళి ఆమెతో పాటు మరికొందరు ఎక్కడంతో షర్మిల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె పనితీరున స్వయంగా కనిమొళి వీక్షించి, అభినందించారు. అయితే, ఆ లేడీ కండక్టర్ టికెట్టుకు చిల్లర ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు ఆమెతో వచ్చిన వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
జాబ్ పోలేదు?
తనకోసం కనిమొళి రావడంతో ఆ కండక్టర్‌ను షర్మిల వారించారు. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్‌లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు.
అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ గాంధీపురం స్టాప్‌లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎంపీ కనిమొళి పట్ల మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేశారు.
ఏదేమైనా తన కలల కొలువుకు దూరమైనట్టు బాధపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బస్సు యజమాని దురై కన్నా మాత్రం మరోలా స్పందించారు. వ్యక్తిగత పబ్లిసిటీ షర్మిలకు పెరిగిందని, అయినా, తాము భరిస్తున్నామని, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని బస్సు యాజమాని దురై కన్న పేర్కొన్నారు. ఈ వ్యవహారం కనిమొళి దృష్టికి చేరడంతో షర్మిలతో ఆమె వ్యక్తిగత సహాయకులు మాట్లాడినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment