సాక్షి, చైన్నె: సెంథిల్ బాలాజీని చట్టబద్ధంగానే అరెస్టు చేశామని, ఆయన్ను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోరు తూ ఈడీ వర్గాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఆగమేఘాలపై ఆదివారం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరాలను సమర్పించాయి.
మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. ప్రస్తుతం బైపాస్ సర్జరీ అనంతరం ఆయన కావేరి ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉన్నారు. ఈ పరిస్థితులలో తన భర్తను ఈడీ చట్టవిరుద్ధంగా అరెస్టు చేసినట్టు సెంథిల్‌బాలాజి సతీమణి మేఘల కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో మేఘల తరఫున వాదనలు ముగిశాయి. ఇందుకు వివరణ ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది.
తర్వాత విచారణ 27వ తేదీ జరగాల్సిన నేపథ్యంలో ఆదివారమే ఆగమేఘాలపై ఈడీ వర్గాలు రిట్ పిటిషన్‌ను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించడం గమనార్హం. ఇందులో సెంథిల్‌ను చట్టబద్ధంగానే అరెస్టు చేశామని వివరించారు. ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అరెస్టు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఆయన్ను ఇంతవరకు తాము విచారించలేదని, కస్టడీకి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే, అరెస్టుకు ముందుగా అధికారులతో సెంథిల్ దురుసుగా ప్రవర్తించారని, ఆయనకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని తారుమారు చేసే పరిస్థితులు ఉన్నట్టు కోర్టుకు ప్రత్యేకంగా వివరించడం గమనార్హం.
అదే సమయంలో మేఘల తరఫున అనుబంధంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. చట్టంలో పేర్కొనలేని అంశాలతో సమాచారం ఇచ్చినట్టు ఈడీ సూచించిందని వివరించారు. అలాగే, 13వ తేదీ రాత్రే విచారణ ముగించినట్టు పేర్కొన్నారని, రెండు గంటల అనంతరం అరెస్టు చూపించారని, రెండుగంటల పాటు తన భర్తను ఎక్కడ ఉంచారో వివరాలను కోర్టుకు ఈడీ తెలియజేయాలని పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment