మాల్, థియేటర్
సాక్షి, చైన్నె: చైన్నె మీనంబాక్కం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ రూపుదిద్దుకున్న భారీ మాల్ నిర్వహణకు చిక్కులు తప్పడం లేదు. ఈ మాల్, సినిమా కాంప్లెక్స్ కారణంగా విమానాశ్రయం వద్ద కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గుర్తించింది. దీంతో ఆ మాల్‌ను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయం నుంచి స్వదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన నగరాలకు , దేశాల రాజధానులకు విమానాల సేవలు అందుతున్న విషయం తెలిసిందే.
రూ. 2400 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దే పనులు జరుగుతున్నాయి. తొలి దశ పనులు ఏప్రిల్‌లో ముగించగా, ప్రస్తుతం రెండో దశ పనులు మొదలెట్టి ఉన్నారు. అలాగే, విమానాశ్రయం పరిసరాల్లో పార్కింగ్ కోసం భారీ భవనం ఏర్పాటు చేశారు. ఇక్కడ 2400 కార్లు తదితర వాహనాలు పార్కింగ్ చేసే విధంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. రూ. 250 కోట్లతో ఆరు అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టారు.
భద్రతా పరమైన కారణాలతో..
విమానాశ్రయం స్వదేశీ, విదేశీ టెర్మినల్స్‌కు మధ్య భాగంలో ఆరు అంతస్తులతో భారీ మాల్‌కు రూపకల్పన చేశారు. ఇక్కడ ప్రయాణికులకు వినోదాన్ని పంచే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు, ఫుట్‌కోట్‌లు, పలు బ్రాండ్లకు సంబంధించిన దుకాణాలు ఇక్కడ కొలువు దీర్చారు. అంతే కాకుండా ప్రముఖ సంస్థ నేతృత్వంలో సినిమా థియేటర్లు ఏర్పాటు చేశారు. వర్తక, వినోద కేంద్రంగా ఉన్న ఇక్కడకు నిత్య జనం తాకిడి పెరగడం విమానాశ్రయానికి కొత్త చిక్కులను సృష్టించి ఉంది. ఇక్కడకు వచ్చే వారి వాహనాలతో ఆ కాంప్లెక్స్‌నిండి పోవడంతో పాటు విమానాశ్రయ పరిసరాలను ఆక్రమిస్తున్నట్టు తేలింది.
అలాగే విమానాశ్రయానికి ఏదేని భద్రతా పరంగా సమస్య తలెత్త వచ్చనే అనుమానాలను చైన్నె ఏయిర్ పోర్టు వర్గాలు ఢిల్లీలోని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇదే మాల్ నుంచి ఓ మహిళ కిందకు దూకి ఆత్మహత్య సైతం చేసుకోవడం వంటి పరిణామాలను, ఇక్కడకు నిత్యం తరలివస్తున్న ప్రేక్షకుల సంఖ్యతో భద్రతా సమస్యలే కాకుండా, పార్కింగ్‌కు మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తించారు.
దీంతో భారీ మాల్, థియేటర్లను మూసి వేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పూర్తిస్థాయి కారణాలను తెలియ జేయకుండా ఏకపక్షంగా మూసి వేయాల్సిందేనంటూ ఆదే శాలు జారీ చేయడంపై సంబంధింత మల్టిఫ్లెక్స్ సంస్థ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment