
అన్నానగర్: తండ్రి చనిపోయాడని తెలియక మూడు రోజులపాటు మృతదేహంతోనే ఉన్న యువకుడి ఉదంతం కలకలం రేపింది. మదురైలోని విల్లాపురానికి చెందిన జగదీశన్(74) జ్యోతిష్యుడు. ఇతని కుమారుడు కార్తీక్ శ్రీనివాసన్(35) మానసిక వ్యాధిగ్రస్తుడు. కూతురు షర్మిల(44)కు వివాహమై భర్తతో కలిసి విల్లాపురం ప్రాంతంలో ఉంటోంది. జగదీశన్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలోనే ఉంటున్నాడు. దీంతో షర్మిల తన తండ్రికి, మానసిక వికలాంగుడైన తమ్ముడికి భోజనం పెడుతోంది.
గత 10న తండ్రి వద్దకు భోజనం ఇవ్వడానికి వచ్చింది. ఆ తరువాత భోజనం ఇవ్వడానికి రాలేదు. జగదీశన్ తన ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో రెండు షాపులను అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో గురువారం అతని ఇంటిలో నుంచి దుర్వాసన వెదజల్లింది. ఆ ఇంటి నుంచి జగదీశన్ గానీ, అతని కొడుకు గానీ బయటకు రాకపోవడంతో బయటి వారికి అనుమానం కలిగింది. దీంతో చూసేందుకు పైకి వెళ్లారు. జగదీశన్ మరణించి అతని శరీరం కుళ్లిపోయింది. అతని శరీరం పక్కనే కార్తీక్ శ్రీనివాసన్ ధ్యానం చేస్తూ ఉన్నాడు. వెంటనే అవనియాపురం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి జగదీశన్ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నారు. జగదీశన్ చనిపోయి మూడు రోజులు అయ్యిందని, తండ్రి చనిపోయాడన్న విషయం తెలియక మానసిక అనారోగ్యంతో ఉన్న కొడుకు మృతదేహం దగ్గరే ఉన్నాడని వెల్లడించారు. గత మూడు రోజులుగా కార్తీక్ శ్రీనివాసన్ ఇంటిలో ఉన్న ఆహారం మాత్రమే తింటున్నాడు. అతని పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. జ్యోతిష్యుడి మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు.