పీక్ అవర్స్‌లోనూ వేట...!
అమెరికా నుంచి అభిమానుల రాక
సాక్షి, చైన్నె: అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా గతంలో ఎన్నికై , ప్రస్తుతం అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ గెలుపు కోసం ఆమె పూర్వీకుల గ్రామంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. బ్రిటన్, అమెరికాల నుంచి ఆమె మద్దతుదారులు పలువురు ఇక్కడకు వచ్చి పూజలలో లీనమయ్యారు. అమెరికా అధ్యక్షురాలుగా ఆమె తన పూర్వీకుల గ్రామానికి వస్తారన్న ఆశాభావాన్ని ఆ గ్రామస్తులు వ్యక్తం చేశారు. వివరాలు.. కమలా హారిస్ పూర్వీకులది తమిళనాడు అన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి తరపు తాత, ముత్తాతలు తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామానికి చెందిన వారు.
దీంతో తమ ఇంటి బిడ్డగా కమలా హ్యారిస్‌ను ఆ గ్రామస్తులు భావిస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఆమె పేరును గతంలో ప్రకటించిన రోజు నుంచి ఈ గ్రామంలో ఎదురు చూపులు పెరిగాయి. గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో రోజూ పూజలు నిర్వహించారు. అమెరికా ఎన్నికల్లో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ విజయకేతనం ఎగుర వేయడంతో ఆ గ్రామంలో ఆనందోత్సాహాలు అప్పట్లో మిన్నంటాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికలలో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో అధ్యక్ష బరిలో కమల హరిస్ నిలబడ్డారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొట్టే విధంగా కమలా దూసుకెళ్లారు. హోరాహోరీగా ఈ ఇద్దరి మధ్య సమరం నెలకొంది. మంగళవారం పోలింగ్ పూర్తి కావడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా 47వ ప్రిసిడెంట్ కమల హరిస్ లేదా ట్రంప్..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితులలో గతంలో వలే కమలా గెలుపు కోసం పూర్వీక గ్రామస్తులు పూజలపై దృష్టి పెట్టారు. తమ గ్రామానికే కాకుండా, కమలా హారీస్ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కుల దైవంగా ఉన్న ధర్మ శాస్త ఆలయంలో కమలా గెలుపు కాంక్షిస్తూ నిత్యం ప్రత్యేక పూజలు చేస్తూ వస్తున్నారు.
మంగళవారం అయితే, ఉదయం నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం పూర్తి ఫలితాలు వెలువడనున్నడంతో కమలా హరిస్‌పేరిట ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌ల నుంచి వచ్చిన కమలా మద్దతుదారులు ఆమె పేరు కలిగిన టీ షర్టులను ధరించి ఆలయంలో పూజలు చేస్తున్నారు. కమలా తప్పకుండా ఈ ఎన్నికలలో గెలుస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షురాలుగా తమ గ్రామానికి కమల వస్తారన్న నమ్మకం ఉందని, ఆమె తప్పకుండా గెలుస్తారని తులసేంద్ర పురం వాసులు పేర్కొంటున్నారు.
కులదైవం ఆలయం ధర్మ శాస్తలో అందరం మొక్కుకున్నామని, తమ కులదైవం ఆమెను ఆశీర్వదిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. గతంలో కూడా ఇక్కడ పూజలు జరిగాయని, ఆమె గెలిచారని గుర్తుచేశారు. కమలా హారీస్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచినానంతరం భారత్ , అమెరికా మధ్య బంధం మరింత బలోపేతం కావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఆలయ పరిసరాలు గ్రామంలో కమలా హరిస్ గెలుపును కాంక్షిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment