తమిళసినిమా: 2011లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం చిరుతై. నటుడు కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. అప్పటినుంచి ఈయనను చిరుతై శివ అనే పిలుస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించారు. అది తెలుగు చిత్రం విక్రమార్కుడు చిత్రానికి రీమేక్ కావడం గమనార్హం. కాగా ఆ తరువాత దర్శకుడు శివ వరుసగా వీరం, వేదాళం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.
కాగా తాజాగా నటుడు సూర్య కథానాయకుడిగా భారీ చారిత్రాత్మక, పాంటసీ కథా చిత్రాన్ని తెరకెక్కించారు. నటి దిశాపటాని నాయకిగా, బాబిడియోల్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియోషన్స్ సంస్థతో కలిసి కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితిల్లో దర్శకుడు శివ తదుపరి నటుడు కార్తీ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరుతై వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత ఈ కాంబోలో చిత్రం వస్తుందంటే కచ్చితంగా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడతాయి.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే నటుడు కార్తీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన మెయ్యళగన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కాగా త్వరలో వా వాద్ధియార్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా సర్ధార్ –2 చిత్రంలో నటిస్తున్న కార్తీ తదుపరి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ– 2 చిత్రంలోనూ నటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment