అవగాహనతోనే తగ్గిన ఎయిడ్స్ కేసులు
వేలూరు: అవగాహనతోనే జిల్లాలో ఎయిడ్స్, హెచ్‌ఐవీ కేసులు తగ్గారని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల పూర్తిగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలతో మానవహారం, వేలూరు కలెక్టరేట్‌లో వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను సాటి మానవులుగా చూడాలన్నారు. సమాజం నుంచి వారిని బహిష్కరించడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన మందులను సరఫరా చేస్తోందన్నారు. వేలూరు జిల్లాలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. గతంలో జిల్లాలో ఐదు శాతం బాధితులుండగా ప్రస్తుతం పూర్తిగా లేనట్లు సర్వేలు చెపుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఎయిడ్స్ బాధితులు లేకుండా చేసేందుకు ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలతో మానవ హారంగా నిలిచి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించిన కార్యకర్తలు, వైద్యులకు అభినందన సర్టిఫికెట్లను అందజేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు నర్సింగ్ సిబ్బంది వద్ద అవగాహన కరపత్రాలను అందజేశారు. ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మహిళా విభాగం అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment