సముద్రంలోకి దూసుకెళ్లిన కారు
● భద్రతా దళం పోలీసు రక్షింపు ● డ్రైవర్ గల్లంతు
సేలం: చైన్నె హార్బర్‌లో రివర్స్ తీసుకుంటున్న సమయంలో సముద్రంలోకి దూసుకెళ్లిన కారు నీటిలో మునిగిపోగా అందులో ఉన్న భద్రతా దళం పోలీసు సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్ సముద్రంలో గల్లంతయ్యాడు. వివరాలు.. చైన్నె హార్బర్‌లో సముద్రతీర భద్రతా దళం పోలీసు జోగేంద్ర కాండా. ఈయనను రోజూ పని ముగిసిన తర్వాత చైన్నె కొలత్తూరుకు చెందిన కారు డ్రైవర్ ముహ్మద్ సకి ఇంటికి తీసుకు వెళుతాడు. ఈక్రమంలో ఎప్పటిలానే మంగళవారం రాత్రి జోగేంద్ర కాండాను తన కారులో సకి ఇంటికి తీసుకువెళ్లడం కోసం వచ్చాడు. అనంతరం జోగేంద్ర కండాను కారులో ఎక్కించుకున్న ముహ్మద్ సకి కారును రివర్స్ తీస్తున్న సమయంలో అకస్మాత్తుగా కారు అదుపుతప్పి సముద్రంలోకి దూసుకువెళ్లింది. ఆ కారు ఒక్కసారిగా సముద్రంలో 80 అడుగుల లోతుకు వెళ్లిపోయింది. అప్పుడు కారు వెనుక వైపు అద్దాలను పగులగొట్టుకుని బయటకు వచ్చిన జోగేంద్ర కండా సముద్రంలో ప్రాణాలకు పోరాడుతూ కనిపించాడు. ఇది గమనించిన హార్బర్‌కు చెందిన మరో డ్రైవర్ ఈ విషయాన్ని పోలీసు అధికారులకు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సముద్రంలో ప్రాణాలకు పోరాడుతున్న జోగేంద్ర కండాను రక్షించి ఆస్పత్రికి తరలించారు. సముద్రంలో గల్లంతైన డ్రైవర్ ముహ్మద్ సకి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సముద్రంలో పడిపోయిన కారును బయటకు తీశారు. హార్బర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment