క్లుప్తంగా
యువకుడి దారుణ హత్య
అన్నానగర్: యువకుడి తలపై బండరాయి వేసి దుండగులు హత్య చేశారు. చైన్నె తండయారుపేట ఇలయముదలి రోడ్డు పక్కన సిమెంట్ పైపులు పేర్చారు. గురువారం ఉదయం చుట్టుపక్కల నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆ ప్రాంత వాసులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తండయార్‌పేట, కొరుక్కుపేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సిమెంట్ పైపు వెనుక మట్టి, ఇటుకలతో సహా కోసిన వ్యర్థాల సంచులను పేర్చారు. వాటిని తీయగా, కింద రక్తంతో తడిసిన బ్యాగ్ ఉంది. బ్యాగ్‌ని బయటకు తీయగా 35 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అతని తల నుజ్జునుజ్జయింది. శరీరం కూడా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. అతని నోటికి గుడ్డ కట్టి ఉంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో హత్య జరిగి 2 రోజులు అయి ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. టీ–షర్ట్, ప్యాంటు ధరించిన యువకుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రుణాలను
సద్వినియోగం చేసుకోండి
వేలూరు: నిరుపేదలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా అభివృద్ధి చెందాలని ప్రధాన ఆర్థికాభివృద్ధి సలహాదారులు కనికాబసర్జీ అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ వృత్తులపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారికి యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో రుణ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని అయితే సరైన పద్ధతిలో ఉపయోగించుకొని అభివృద్ది చెందాల్సిన బాధ్యత నిరుద్యోగులపై ఉందన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న రుణాలను ప్రతి నెలా బ్యాంకులకు సరైన మార్గంలో చెల్లించి మరిన్ని రుణాలు పొందేలా చూడాలన్నారు. యూనియన్ బ్యాంకు చైన్నె రీజినల్ మేనేజర్ అన్నాదురై, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సురేష్, అసిస్టెంట్ అధికారి గోమతి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి పుస్తక ప్రదర్శన
● పది రోజులపాటు ఎగ్జిబిషన్
● వేల్‌టెక్ వర్సిటీలో అవగాహన కార్యక్రమం
తిరువళ్లూరు: పట్టణంలో నేటి నుంచి జరగనున్న పుస్తక ప్రదర్శనపై వేల్‌టెక్ వర్సిటీకి చెందిన నాలుగు వేల మంది విద్యార్థులతో నిర్వహించిన బుక్ ఫేర్–తిరువళ్లూరు నమూనా అందరిని ఆకట్టుకుంది. తిరువళ్లూరులో నేటి నుంచి మార్చి 17 వరకు పుస్తక ప్రదర్శన పది రోజుల పాటు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈక్రమంలో పుస్తక ప్రదర్శనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆవడి వేల్‌టెక్ వర్సిటీలో నాలుగు వేల మంది విద్యార్థులతో బుక్ ఫేర్– తిరువళ్లూరు నమూనాను నిర్వహించారు. నమూనాపై విద్యార్థులు నిలబడి ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ బుక్‌ఫేర్‌పై అవగాహన కల్పించే విధంగా భారీ బెలూన్లను ఎగరవేశారు. ఆవడి కమిషనర్ కందస్వామి, మేయర్ ఉదయకుమార్, వర్సిటీ ట్రస్టీ రంగరాజన్, వీసీ రజత్‌గుప్తా, శివరామన్, రిజిస్ట్రార్ కన్నన్ పాల్గొన్నారు.
లారీని ఢీకొన్న కారు
ముగ్గురికి తీవ్ర గాయాలు
వేలూరు: లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బెంగుళూరుకు చెందిన మార్య ఇతని తండ్రి జేమ్స్‌తో పాటు మరొకరు గురువారం ఉదయం కారులో చైన్నెకి బయలు దేరారు. కారు చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిలో వెళుతుండగా కారు వేలూరు సమీపంలోని సేన్‌బాక్కం వద్ద వెళుతుండగా అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న జేమ్స్, మౌర్యతో పాటు మరొకరికి తీవ్ర గాయామైంది. వీటిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలిసి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్లుప్తంగా
Comments
Please login to add a commentAdd a comment