కనుల పండువగా రథోత్సవం
సేలం : విరుదాచలం విరుద్ధగిరీశ్వరర్ ఆలయంలో మంగళవారం నిర్వహించిన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగి మొక్కులు తూర్చుకున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలంలో సుమారు 1800 సంవత్సరాల పురాతనమైన విరుద్దాంబికై , బాలాంబికై ల సమేత విరుద్దగిరీశ్వర్ స్వామి ఆలయం ఉంది. 5 గోపురాలు, 5 నందిలు, 5 ప్రాకారాలు, 5 తీర్థాలు, 5 రథాలు అంటూ అన్ని ఐదు అంకెతో ప్రత్యేకాంశాలు కలిగిన ఆలయం ఇది. ఏటా లాగేనే ఈ ఏడాది మాస ఉత్సవాలు గత 3వ తేది ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో ముఖ్య ఘట్టమైన రథోత్సవం మంగళవారం ఉదయం 5.50 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రమణ్య స్వామి, విరుద్దగిరీశ్వరర్, విరుద్దాంబికై , చండికేశ్వరర్ వంటి పంచమూర్తులకు పాలు, పెరుగు, పన్నీరు, కొబ్బరి నీరు, తేనె, పంచామృతం వంటి పలు ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి, పూజలు నిర్వహించారు. అనంతరం పంచ మూర్తుల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక ఐదు రథాలపై ఊరేగించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి రధాలను పట్టి లాగారు. నాలుగు మాడ వీధులను ఊరేగిన అనంతరం ఐదు రధాలు ఆలయానికి చేరుకున్నాయి. కాగా ఉత్సవాలలో 10వ రోజు బుధవారం మాసి మహా తీర్థవారి, గురువారం తెప్పోత్సవం, 14వ తేది చండికేశ్వరర్ ఉత్సవం, 15వ తేది ధ్వజ అవరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఆలయం వద్ద నుంచి బయలుదేరుతున్న పంచ మూర్తుల రధాలు
Comments
Please login to add a commentAdd a comment