కనులపండువగా తిరుమలీశ్వరర్ మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: పళ్లిపట్టు సమీపంలో 1,500 సంవత్సరాల చరిత్ర కల్గిన తిరుమలీశ్వరర్ ఆలయ మహాకుంభాభిషేకాన్ని సోమవారం కనులపండువగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని కొళత్తూరులో కుశస్థలినది తీరంలో 1,500 ఏళ్ల కిందట వశ్రీ కృష్ణదేవరాయులు త్రిపురసుందరి సమేత తిరుమలేశ్వరర్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈక్రమంలో పదేళ్ల కిందట తిరుత్తణికి చెందిన శేషన్, యగ్నప్రియ దంపతులు ఆలయం జీర్ణోద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణుల సహకారంతో పదేళ్ల నుంచి ఆలయ పునఃనిర్మాణ పనులు జరిగాయి. రాజ, విమాన గోపురం, సన్నధులు, రాళ్ల మండపాలు, ఆలయ రాతి ప్రహరీ గోడలు, రాతి ఽ ధ్వజస్తంభం పనులు చేసి సర్వాంగసుందరంగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేశారు. దీంతో గురువారం నుంచి సోమవారం వరకు ఐదురోజుల పాటు మహాకుంభాభిషేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మహాపూర్ణాహుతి అనంతరం మేళ తాళాల నడుమ పవిత్రపుణ్య తీర్థాలను కలశాలతో తీసుకెళ్లి రాజగోపురం, విమాన గోపురాలకు శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు శివనామస్మరణతో స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తులపై పవిత్ర తీర్థజలాలు వెదజెల్లారు. సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామీణులు మహాకుంభాభిషేకం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కనులపండువగా తిరుమలీశ్వరర్ మహాకుంభాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment