బృందా థియేటర్ కూల్చివేత పనులు ప్రారంభం
● ఆవేదన వ్యక్తం చేస్తున్న అభిమానులు
కొరుక్కుపేట: సూపర్‌స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా 1985 సంవత్సరంలో ప్రారంభమైన బృందా థియేటర్ నాలుగు దశాబ్దాల పాటూ అభిమానులను ఎంతో అలరించింది. కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇప్పటికే సినిమాలను ప్రదర్శించడం ఆగిపోయింది. సరిగ్గా నెలరోజులు ముందు చైన్నె అశోక్ పిల్లర్ వద్ద ఉన్న చారిత్రక ఉదయం థియేటర్‌నూ కూల్చి వేశారు. ఈక్రమంలో బృందా థియేటర్ కూల్చివేత పనులు కూడా ప్రారంభం కావడం అభిమానులకు బాధ కలిగిస్తోంది. వివరాలు.. సెల్‌ఫోన్లు, ఓటీటీలు వచ్చిన తర్వాత, గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీనికి ప్రతిగా తమిళనాడు వ్యాప్తంగా ఐకానిక్ థియేటర్లను కూల్చివేసి వాణిజ్య సముదాయాలు, ప్లాట్లుగా మార్చడంతోపాటూ రాజధాని చైన్నెలో శతాబ్దాల నాటి థియేటర్లు సైతం ప్లాట్లు, వాణిజ్య భవనాలుగా మారుతున్నాయి. ఇప్పటికే చైన్నెలో పాపులర్ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణితదితర ఎన్నో థియేటర్లు నేలమట్టమయ్యాయి. కొన్ని థియేటర్లు ముత్యాల తెరలు కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన పెరంబూర్ బృందా థియేటర్ చరిత్ర సోమవారంతో ముగిసింది. ఏప్రిల్ 14, 1985న సూపర్ స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా బృందా థియేటర్‌ని ప్రారంభించారు. అప్పుడు లోగనాథన్ చెట్టియార్ దాని యజమాని. అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్, చంద్రశేఖర్ దీనిని కొనసాగించారు. ఈ సందర్భంలో బృందా థియేటర్ సోమవారం చివరి ప్రదర్శనను పూర్తి చేసుకుంది. మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఇక నుంచి ఈ థియేటర్‌ను కూల్చివేయనున్నారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. ఉత్తర చైన్నెలో మొదటి ఎయిర్ కండిషన్డ్ థియేటర్, సుమారు 15 గ్రౌండ్‌ల విస్తీర్ణంలో ఉన్న థియేటర్‌గా ఇది గుర్తింపు పొందింది. 1,170 మంది కూర్చుని సినిమా చూడొచ్చు. ఉత్తర చైన్నెలో రజనీకాంత్ థియేటర్‌కు అతి పెద్ద థియేటర్‌గా పేరుంది. ససినిమా ఏదైతేనేం ఈ థియేటర్‌లో ఫస్ట్ షోకే సందడి. రజనీ అభిమానులు ఇష్టపడి సినిమాలు చూసే థియేటర్లలో బృందా థియేటర్ ఒకటి. బాద్‌షా, మాపిళ్లై, పడయప్పతో సహా పలు చిత్రాలు ఇక్కడ ఎక్కువ కాలం ఆడి రికార్డు సృష్టించాయి. గత 40 ఏళ్లుగా ఈ థియేటర్ ప్రజల ఆనందానికి ప్రతీక. ఎట్టకేలకు సోమవారం డ్రాగన్ సినిమా తెరకెక్కి, అన్ని సన్నివేశాలు పూర్తయ్యాయి.40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మా థియేటర్‌కి బృందా థియేటర్ అని పేరు పెట్టినా రజనీ థియేటర్ అని పిలుస్తారని, రజనీ ఈ థియేటర్‌ని ప్రారంభించారు.. రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని.. 40 ఏళ్లుగా ప్రజలకు అందించినందుకు సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment