సీఎం రాకకు భారీ ఏర్పాట్లు
తిరువళ్లూరు: రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు డీఎంకే పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం తిరువళ్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం డీఎంకే నేతలు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న కేంఽద్ర ప్రభుత్వం తీరుతో పాటు పార్లమెంట్‌లో తమిళనాడు ఎంపీలను కించపరిచేలా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ డీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ద్వారా ఽనిరసన వ్యక్తం చేయాలని డీఎంకే అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్‌చార్జ్‌లుగా నియమించి తమ గళాన్ని గట్టిగా వినిపించాలని సూచించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరులో జరిగే నిరసన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ హాజరుకానున్నారు. ఇందుకోసం భారీ స్టేజీతో పాటు 20 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లకు ఇరువైపులా పార్టీ జెండాలు, కటౌట్‌లను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు సభ ప్రారంభమై పది గంటల వరకు జరిగే అవకాశం వుంది. సభకు భారీగా జనాన్ని సమీకరణ చేయాలని నేతలు నిర్ణయించి కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పార్టీ నేత అన్బగం కలై, మంత్రి నాజర్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి, తిరుత్తణి చంద్రన్ మంగళవారం పరిశీలించారు. అయితే మంగళవారం మోస్తరు వర్షం కురవడంతో ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. సభా ప్రాంగణం వద్ద నీరు నిలిచిపోయింది. 40 నిమిషాల పాటు కురిసిన వర్షం తెరిపి ఇవ్వడంతో ఏర్పాట్లను మళ్లీ ప్రారంభించి శరవేగంగా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment