అన్నాడీఎంకే త్వరలోనే వికసిస్తుంది
–తిరువణ్ణామలైలో శశికళ
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో వీకే శశికళ (చిన్నమ్మ) స్వామి దర్శనార్థం బుధవారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ శివాచార్యులు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం చుట్టూ ఉన్న గిరివలయం రోడ్డులో కారులో తిరిగి వచ్చి అష్టలింగాలను ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలోనే వికసించక తప్పదన్నారు. విడిపోయిన వారందరూ త్వరలోనే ఒకటిగా చేరతారన్నారు. అందరినీ కలిసికట్టుగా చేర్చేందుకు తాను పాటు పడుతున్నానని తెలిపారు. 2026వ అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమన్నారు. డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు ఇప్పటికే విరక్తి చెందారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్నాడీఎంకే ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల విస్తరణపై డీఎంకే ఏర్పాటు చేసిన అఖిలపక్ష పార్టీ సమావేశం ఒక సంచలనం సృష్టించేందుకే తప్ప ఇంక ఎందుకూ పనికి రాదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో 2013 సంవత్సరం తర్వాత ఇంతవరకు కాళీలను భర్తీ చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులు భర్తీ చేయకుండానే ఉందన్నారు. ఈ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ కాలంలో తమిళనాడు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయించారని, ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోందన్నారు. సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment