శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ ఘటనలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. 1వ పట్టణ సీఐ గోపి, క్రైమ్ పార్టీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టారన్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. తమిళనాడు మేలుమలైకి చెందిన మీనా(29), తిరుచ్చి జిల్లా సమయపురానికి చెందిన పొన్నుమణి అక్కచెల్లెళ్లు. వీరు సంతల్లో, బస్సుల్లో జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో హ్యాండ్‌బ్యాగులు, పర్సులు దొంగలిస్తుంటారని తెలిపారు. వీరిపై తమిళనాడులో ఆరు కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. జైలు నుంచి బయలకు రాగా లాయరు ఖర్చు నిమిత్తం దొంగతనం చేసేందుకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను ఎంచుకున్నట్టు తెలిపారు. రథోత్సవం రోజున భక్తులతో కలిసిపోయి తోపులాట జరిగినపుడు మహిళల మెడలో బంగారు గొలుసులను అపహరించినట్టు వెల్లడించారు. వీరు పట్టణంలోని నెహ్రూవీధిలోని సుదర్శన్ ల్యాబ్, తేరువీధిలోని కోమల రెసిడెన్సీ, నగరివీధిలోని వినాయకస్వామి ఆలయం, సునీల్ నగల దుకాణం ముందు, తేరువీధిలోని నంది హోటల్, పెండ్లి మండపం వద్ద మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను అప్పహరించినట్టు తెలిపారు. వీరిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. కేసును ఛేదించిన వారిని ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించినట్టు పేర్కొన్నారు. సీఐ గోపి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment