సంతకాల సేకరణకు అడ్డుకట్ట
సాక్షి, చైన్నె: త్రిభాషా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణలో నిమగ్నమైన బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా సంతకాల సేకరణ చేయకూడదని స్పష్టం చేస్తూ అరెస్టు చేశారు. వివరాలు.. తమిళనాడు ప్రభుత్వంతో పాటూ మెజారిటీ శాతం పార్టీలు త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. హిందీని తమ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది. డీఎంకేతో పాటూ కూటమి పార్టీలు ఆందోళనలు సైతం కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితులలో బీజేపీ నేతృత్వంలో రాష్ట్రంలో త్రి భాషా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇంటింటా సంతకాల సేకరణతో త్రిభాషను తమిళనాట ఆదరించే వాళ్లు అధికంగా ఉన్నారని చాటే విధంగా, కేంద్రానికి మద్దతుగా రాష్ట్రపతిని కలిసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం నుంచి ఇంటింటా సంతకాల సేకరణ అంటూ ఆయా ప్రాంతాలలో బీజేపీ వర్గాలు కార్యక్రమాలు చేపట్టాయి. ఇందులో భాగంగా విరుగంబాక్కం పరిధిలోని ఎంజీఆర్ నగర్ మార్కెట్ పరిసరాలలో సంతకాల సేకరణకు బీజేపీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌తో పాటూ పలువురు మహిళా నేతలు సైతం హాజరయ్యారు. వీరంతా ఎంజీఆర్ నగర్ మార్కెట్ వద్ద సంతకాల సేకరణకు సిద్ధమయ్యారు. అయితే, అనుమతి లేకుండా సంతకాల సేకరణ చేయరాదని పోలీసులు ఆదేశించారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం తప్పలేదు. సంతకాల సేకరణను పోలీసులు అడ్డుకోవడంతో నిరసన కారులు రాస్తారోకోకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. మహిళా పోలీసుల ద్వారా తమిళి సైను చుట్టుముట్టారు. బలవంతంగా తమిళి సై సౌందరరాజన్‌తో పాటుగా నాయకులను అరెస్టు చేశారు. ఆ తర్వాత విడుదల చేశారు.
● తమిళిసై సహా నేతల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment