మిత్రుడిని చూసేందుకు వెళ్లి..
సాక్షి,చైన్నె : చైన్నెలోని కళాశాలలో చదువుకుంటున్న మిత్రుడిని చూసేందుకు వచ్చిన వారు ప్రమాదం బారిన పడ్డారు. బుధవారం అర్థరాత్రి చైన్నె శివారులో కారు – లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మిత్రులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు నెల్లూరుకు చెందిన ధనుష్‌రెడ్డి(21) చైన్నె శివారులోని ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నెల్లూరులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న ఽమిత్రులు శ్రేయాష్(21), మరో ఇద్దరు విద్యార్థినులు ధనుష్‌రెడ్డిని చూసేందుకు కారులో చైన్నెకు వచ్చారు. బుధవారం రాత్రి ధనుష్‌రెడ్డిని కలిశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఐదుగురితో పాటూ ధనుష్ కళాశాల మిత్రుడు జయంత్‌తో కలిసి కారులో చైన్నె వైపుగా బయలుదేరారు. మార్గంమధ్యలోని ఊరపాక్కం దాటగానే కిలాంబాక్కం సబర్బన్ బస్ టెర్మినల్‌కు కూత వేటు దూరంలో ముందుగా వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగినట్టు సమాచారం. దీంతో వెనుక వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలంలో ధనుష్‌రెడ్డి, శ్రేయాష్ మరణించారు. గాయపడ్డ ఇద్దరు విద్యార్థినులు, జయంత్‌ను చికిత్స నిమిత్తం పొత్తేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిత్రులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదం..
ఈ ప్రమాదం అర్ధరాత్రి వేళ జరగ్గా ఇదే ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉదయాన్నే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కాటాన్ కొళత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలోని నాలుగో వీఽధికి చెందిన కన్నియప్పన్ (48) కార్పంటైర్. ప్రైవేటు కళాశాలలో చదువుతున్న కుమార్తె మౌనిషాను తన మోటార్ సైకిల్‌పై దిగబెట్టేందుకు వెళ్లాడు. ఊరపాక్కం వైపుగా వేగంగా దూసుకొచ్చిన మోటారు సైకిల్ ఢీ కొనడంతో తండ్రి,కుమార్తె కింద పడ్డారు. ఈ ఘటనలో కన్నియప్పన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. మౌనిషాకు పొత్తేరిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నెల్లూరు విద్యార్థుల మృతి
మరో ముగ్గురికి గాయాలు
మిత్రుడిని చూసేందుకు వెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment