కొత్త కేసులు నమోదు చేయొద్దు!
● ఉదయనిధి సనాతనం వ్యవహారంలో సుప్రీం కోర్టు
సాక్షి, చైన్నె : సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దు అని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఇందులో పోలీసు కేసుల విచారణకు బ్రేక్ వేస్తూ స్టే ఉత్తర్వులను పొడిగిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు ఇవ్వడం ఉదయ నిధికి ఊరట కలిగినట్లయ్యి్‌ంది. 2023లో క్రీడల మంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం రచ్చకెక్కింది. దీనిని తీవ్రంగా పరిగణించిన హిందూ సంఘాలు, పార్టీలు ఆయనపై రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలలో అనేక కేసులు నమోదు పై దృష్టి పెట్టాయి. పోలీసుల ద్వారా కొన్ని కేసులు, కోర్టుల ద్వారా మరికొన్ని కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులన్నింటినీ ఒకే గొడుగు నీడలోకి తెస్తూ విచారణను మద్రాసు హైకోర్టుకు లేదా కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఉదయనిధి స్టాలిన్ అభ్యర్థించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్‌కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఉదయనిధి తరపున సీనియర్ న్యాయవాదులు విల్సన్, అభిషేక్ మను సింఘ్వీ హాజరయ్యారు. పనిగట్టుకుని బిహార్ తదితర రాష్ట్రాలలో ప్రస్తుతం కూడా కేసులను నమోదు చేస్తున్నారని, కేవలం విచారణ జాప్యం చేయడం, ఉదయనిధిని అక్కడకు ఇక్కడకు విచారణ పేరిట తిప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాదించారు. ఈ కేసులన్నీ ఒకే గొడుగున చేరుస్తూ మద్రాసు హైకోర్టుకు లేదా కర్ణాటకకు బదిలీ చేయాలని కోరారు. వాదన అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ కొత్తగా కేసుల నమోదుకు బ్రేక్ వేశారు. సనాతన ధర్మం వ్యవహారంలో ఉదయ నిధిపై కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దు అని ఆదేశించారు. గత కేసుల విషయంలో ఎలాంటిచర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ ఇచ్చిన స్టేను కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 21వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment