వెంటాడుతున్న ఈడీ
● సెంథిల్, జగత్‌పై గురి ● పలు చోట్ల సోదాలు
సాక్షి, చైన్నె : మంత్రి సెంథిల్ బాలాజీ, ఎంపీ జగద్రక్షకన్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెంటాడుతోంది. గురువారం వీరికి సంబంధించిన అనేక చోట్ల సోదాలు జరిగాయి. కొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. సెంథిల్ బాలాజీని ఇది వరకు ఈడీ టార్గెట్ చేయడం, అరెస్టు చేయడం తెలిసిందే. కొన్ని నెలలు జైలులో ఉన్న ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్నారు. అదే సమయంలో బెయిల్ రద్దు లక్ష్యంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈడీ వర్గాలు, మంత్రిని వదిలి పెట్టడం లేదు. గురువారం సెంథిల్‌బాలాజీ సన్నిహితులైన కరూర్‌లోని రాయనూరు కొగుమెస్ యజమాని మణి, కరూర్‌లోని బోదై నగర్‌లో ఉన్న శక్తిమెస్ యజమాని కార్తీక్, ప్రభుత్వం కాంట్రాక్టర్, మంత్రి సన్నిహితుడు శంకర్‌ను ఈడీ గురి పెట్టింది. వీరి ముగ్గురి నివాసాలలో పొద్దు పోయే వరకు విస్తృతంగా సోదాలు జరిగాయి. ఈ సోదాలన్నీ తుపాకీ నీడలో జరగడం గమనార్హం. అలాగే డీఎంకే సీనియర్ ఎంపీ జగద్రక్షకన్‌ను తరచూ ఈడీ టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన లిక్కర్ ఫ్యాక్టరీతో పాటూ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే చైన్నె ఎగ్మూర్‌లోని టాస్మాక్ మద్యం ( మార్కెటింగ్ శాఖ) కార్యాలయంలోనూ విస్తృతంగా సోదాలలో ఈడీ వర్గాలు నిమగ్నమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment