21న తెరపైకి ఎన్నై చుడుమ్ పణి
తమిళసినిమా: యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్నై చుడుమ్ పణి. నటరాజ్ సుందర్‌రాజ్ హీరోగా నటించిన ఇందులో ఉపాసన ఆర్‌సీ హీరోయిన్‌గా నటించారు. దర్శకుడు కే.భాగ్యరాజ్, చిత్రా లక్ష్మణన్, మనోబాలా, తలైవాసల్ విజయ్, ముత్తుకాళై, సింగంపులి, కూల్ సురేష్, సుందర్‌రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కామ్‌సేవ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఎస్‌ఎన్‌ఎస్ పిక్చర్స్ పతాకంపై హేమలత సుందర్‌రాజ్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ చిత్రం షూటింగ్‌ను చైన్నె, పొల్లాచ్చి, మరైయూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. భారీ వ్యయంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రానికి నృత్య దర్శకత్వం వహించిన డాన్స్‌మాస్టర్ శాండీమాస్టర్ ఒక ప్రత్యక పాటలో నటించడం విశేషం అన్నారు. అలాగే ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారన్నారు. ఎన్నై చుడుమ్ పణి చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలతో జనరంజకంగా ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాత పేర్కొన్నారు. కాగా దీనికి అరుళ్‌దేవ్ సంగీతం, వెంకటేశ్ చాయాగ్రహణం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment