సంతకాలు సేకరిస్తే చర్యలు
– మంత్రి అన్బిల్ మహేష్
తిరువళ్లూరు: త్రిభాషా విద్యావిధానానికి మద్దతుగా బీజేపీ నేతలు విద్యార్థుల చేత బలవంతపు సంతకాల సేకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌మహేష్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన నాల్గవ పుస్తకాల ప్రదర్శనను మంత్రులు అన్బిల్‌మహేష్, నాజర్, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పుస్తకాల విక్రయాలను మంత్రి అన్బిల్ మహేష్ లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఒక మంచి పుస్తకంతో స్నేహం ద్వారా వంద చెడు అలవాట్లకు దూరంగా వుండొచ్చన్నారు. తిరువళ్లూరులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో 109 స్టాల్స్‌లో లక్షకు పైగా పుస్తకాలను విక్రయానికి వుంచామని, ప్రతిఒక్కరు పుస్తకాన్ని కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి అన్బిల్‌మహేష్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.200 వందల కోట్లు తీసుకుని త్రిభాషా విధానం, నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే రాష్ట్రంలోని ప్రజలను రెండు వందల సంవత్సరాలు వెనక్కినెట్టినట్టు అవుతుందన్నారు. రాష్ట్రంలో హిందీని అనుమతించడం ద్వారా తమ మాతృభాషపై తీవ్ర ప్రభావం చూపి రాబోయే రోజుల్లో తమిళంను కనుమరుగు చేయాలన్నదే బీజేపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. డీఎంకే ఉన్నంత వరకు తమిళ భాషను మరింత పరిరక్షించుకోవడంతో పాటు హిందీని తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. పాఠశాల ముందు నిలబడి బడి పిల్లల వద్ద త్రిభాషా విధానానికి మద్దతుగా సంతకాలు చేయాలని బలవంతం చేయడం సరికాదన్నారు. విద్యార్థుల వద్ద బలవంతపు సంతకాల సేకరణ జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షలకు మందు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేశామని, దీంతో విద్యార్థులకు పరీక్షలంటే భయం పోవాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇటీవల తిరువళ్లూరులో ప్లస్‌టూ విద్యార్థిని ఆత్మాహుతి వ్యవహారంపై నిగ్గు తేల్చడానికి కలెక్టర్ ప్రత్యేక కమిటీని నియమించారని తెలిపారు. కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి, చంద్రన్, టీజే గోవిందరాజన్, దురైచంద్రశేఖర్, సుదర్శనం, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, డీఆర్వో రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment