నేరుగా ఓటీటీలోకి టెస్ట్
తమిళసినిమా: నయనతార చిత్రం వస్తుందంటే సినీ పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ కచ్చితంగా అటెన్సన్ ఉంటుంది. తాజాగా ఈమె నటించిన టెస్ట్ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి నయనతార. ఈమె చేతిలో ప్రస్తుతం టాక్సిక్, రాకాయి, డియర్ స్టూడెంట్, మూక్కుత్తి అమ్మన్ 2, మన్నాగట్టి చిత్రాలు ఉన్నాయి. వాటిలో టెస్ట్ ఒకటి. వైనాట్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ కలిసి నిర్మించారు. కాగా ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత శశికాంత్ దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. ఇందులో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన చిత్రం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి శక్తిశ్రీ గోపాలన్ సంగీతాన్ని అందించారు. నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న నయనతార నటించిన 4వ చిత్రం ఇది. ఇంతకుముందు మూక్కుత్తి అమ్మన్, నెట్రిక్కన్, ఓ–2 చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదల అయ్యాయన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment