నో పార్కింగ్!
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో రద్దీతో కూడుకున్న హోటళ్లు వినియోగదారులకు కనీసం పార్కింగ్ సౌకర్యం సైతం కల్పించడంలో విఫలమయ్యాయి. ఇందులో 80 హోటళ్లను గుర్తించిన ట్రాఫిక్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చైన్నె కార్పొరేషన్‌కు సమాచారం పంపించారు. చైన్నె నగరంలో నిర్ణీత చదరపు అడుగుల స్థల ఆధారంగా ఆయా హోటళ్లు, దుకాణాలు, వాటిలో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి. అయితే, అనేక హోటళ్లు కనీసం ద్విచక్ర వాహనాలు ఆపేందుకు కూడా పార్కింగ్ సౌకర్యం కల్పించడం లేదు. వీటి కారణంగా ఆయా మార్గాల్లో ట్రాపిక్ కష్టాలు తప్పడం లేదు. హోటళ్లకు ఎదురుగా ఉన్న రోడ్ల మీద, ఫుట్ పాత్‌ల మీద వాహనాలు ఆపడం కారణంగా వాహన చోదకులకు కష్టాలు ఎక్కువే. వీటిన్నింటిని ట్రాఫిక్ యంత్రాంగం గుర్తించింది. అయితే, వాహనాలు ఆపే వారికి జరిమానాలు తప్పడం లేదు. హోటళ్లలోకి వెళ్లి వచ్చేలోపు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మరోచోటకు తరలించేస్తున్నారు. నో పార్కింగ్స్, రోడ్లపై వాహనాలు ఆపినందుకు వాహన దారుడికి జరిమానాల వడ్డన తప్పడం లేదు. అదే సమయంలో పార్కింగ్ సౌకర్యం కూడా లేకుండా హోటళ్లను నడుపుతున్న ఆ యాజమాన్యాల భరతం పట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో రద్దీతో కూడుకున్న ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోకుండా నడుపుతున్న 80 హోటళ్లను గుర్తించారు. వీటన్నింటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని, సమగ్ర వివరాలతో సమాచారాన్ని శుక్రవారం కార్పొరేషన్‌కు పంపించారు. కార్పొరేషన్ అధికారులు ఏ మేరకు స్పందిస్తారో, ఆయా హోటళ్లకు జరిమానా విధింపుతో పాటు పార్కింగ్ సౌకర్యం కల్పన తప్పనిసరిగా అమలు చేయిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment