కలిసికట్టుగా పనిచేద్దాం!
లోక్‌సభ పునర్విభజన వ్యవహారంలో దక్షిణాది రాష్ట్రాలకు కలగనున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అందరం కలిసికట్టుగా ముందుకెళదామని ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈనెల 22న చైన్నెలో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు.
సాక్షి, చైన్నె: గత జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకునేందుకు సీఎం స్టాలిన్ దూకుడు పెంచారు. ఇప్పటికే రాష్ట్రంలోని యాభైకు పైగా పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర, దక్షిణాధి రాష్ట్రాల్లోని ఎంపీలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో మరో అడుగుగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలను ఏకం చేసే దిశగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగా అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా పిలుపునిస్తూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు శుక్రవారం సీఎం స్టాలిన్ లేఖ రాశారు.
లేఖలు..
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్మాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలకు స్టాలిన్ లేఖ రాశారు. అలాగే, ఆయా పార్టీలలోని ముఖ్య నేతలకు సైతం ఇదే లేఖలను పంపించారు. ఇందులో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన గురించి కేంద్రం చేస్తున్న కసరత్తులను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ జరిగిన పక్షంలో లోక్‌సభ స్థానాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
అఖిల పక్షం సమావేశంలో రాష్ట్రాల పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిథ్యంను కాపాడుకునేందుకు పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న ప్రాతినిథ్యం శాతం పరంగా అందరం కలిసి పనిచేసి, నియోజకవర్గాలను రక్షించడానికి పరిష్కారాలను రూపొందించాల్సిన అవశ్యం ఉందని ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఈనెల 22న చైన్నెలో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రారంభ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రారంభోత్సవాల్లో బిజీ బిజీ..
ముందుగా సచివాలయం నుంచి పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. చైన్నె మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ నేతృత్వంలో 3 ప్రాజెక్టులను ప్రారంభించారు, 10 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రారంభించిన వాటిలో పోరూర్‌లో హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరిట 16.63 ఎకరాల విస్తీర్ణంలో వెట్‌ల్యాండ్ గ్రీన్ పార్క్, కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్ కాంప్లెక్స్, శాతాంగాడు, ఇనుము, ఉక్కు మార్కెట్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టు పనుల్లో చైన్నెలోని కాట్టుపాక్కంలోని ఇందిరానగర్, పోరూర్, గణేష్ నగర్ బహుళ–విభాగ కేంద్రాలు, కుత్తంబాక్కంలో ఫుట్‌బాల్ స్టేడియం, కుత్తంబాక్కం సబర్బన్ బస్ టెర్మినల్, సైదాపేట, అమ్మ పార్క్, తాంబరంలో డాక్టర్ అబ్దుల్‌కలాం పార్కు నిర్మాణ పనులు ఉన్నాయి. మంత్రి, సీఎండీఏ చైర్మన్ శేఖర్‌బాబు, సీఎస్ మురుగానందం, అదనపు ప్రధాన కార్యదర్శి కాకర్ల ఉష పాల్గొన్నారు. అలాగే, 500 మందికి ఉపాధి లక్ష్యంగా అమెరికన్ ఈటన్ గ్రూప్ అనుబంధ సంస్థ ఈటన్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, షోళింగనల్లూరులో ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. సీఎస్ మురుగానందం, వాణిజ్యశాఖ కార్యదర్శి వి.అరుణ్‌రాయ్. తమిళనాడు కెరీర్ గైడెన్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అలమేలు మంగై, ఈటాన్ చైర్మన్ సైమన్ మాథెసన్, ఈటన్ ఇండియా అధ్యక్షుడు మైరెన్ డ్రైవ్, డైరెక్టర్ ఫిలిప్పోస్ జాకబ్, ప్రాజెక్ట్ లీడర్ హెర్మన్ పెన్నిస్ పాల్గొన్నారు.
ఏడు రాష్ట్రాల తాజా,
మాజీ సీఎంలకు స్టాలిన్ పిలుపు
లోక్‌సభ పునర్విభజనకు వ్యతిరేకంగా మరో అడుగు
ప్రారంభోత్సవాల్లో స్టాలిన్ బిజీ
సురక్షిత ప్రయాణానికి క్యూఆర్ కోడ్
సురక్షిత ప్రయాణానికి క్యూఆర్ కోడ్
ఆటో రిక్షాలు, అద్దె కార్లలో ప్రయాణించే వారి భద్రత, సురక్షిత ప్రయాణం కోసం గ్రేటర్ చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు క్యూఆర్ కోడ్ సౌకర్యం కల్పించారు. ఆయా వాహన రూట్ మ్యాపింగ్‌తో సాంకేతికత ఆధారిత భద్రతా చర్యలు తీసుకున్నారు. చైన్నె నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు పరిసర జిల్లాల్లోని 89,641 ఆటోరిక్షాలు, ఇతర వాహనాలకు క్యూఆర్ కోడ్ సిద్ధం చేశారు. ఇందులో 78వేల ఆటో రిక్షాలు ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి సేవలతో అనుసంధానించబడింది. ఆటోలు, కార్లు, అద్దె వాహనాలలో డ్రైవర్ సీటు వెనుక క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా స్కాన్‌చేస్తే కంట్రోల్ రూమ్‌కు హెచ్చరికలు వెళ్తాయి. వెంటనే గస్తీ బృందాలు రంగంలోకి దిగి ఆయా వాహనాలను సమీపించి అందులో ఉన్నవారిని రక్షించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. అదనంగా, ప్రయాణికుల అత్యవసర సేవల కోసం 112 నంబర్‌కు కాల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. వీటిని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. మంత్రులు పొన్ముడి, శేఖర్‌బాబు, చైన్నె కమిషనర్ అరుణ్, అదనపు కమిషనర్ ఆర్. సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం చైన్నె ఐల్యాండ్ గ్రౌండ్‌లో సీఎండీఏ నేతృత్వంలో రూ.113 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు రెండు అంతస్తులతో నిర్మిస్తున్న అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన ఎగ్జిబిషన్ పనులను సీఎం పరిశీలించారు.
కలిసికట్టుగా ముందుకెళదాం..
చైన్నెలో ఈనెల 5న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను వివరించారు. ప్రధానంగా నియోజకవర్గ పునర్విభజనతో సమస్యకు గురయ్యే రాష్ట్రాల్లోని పార్టీల నుంచి కీలక ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిట్ఙీని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించామని గుర్తు చేశారు. రాష్ట్రాల పురోగతికి ఆటంకం కలిగించే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment