కూలిన బతుకులు | - | Sakshi
Sakshi News home page

కూలిన బతుకులు

Published Sat, Mar 8 2025 1:03 AM | Last Updated on Sat, Mar 8 2025 12:59 AM

కూలిన

కూలిన బతుకులు

వారంతా కూలీ కార్మికులు.. బతుకుదెరువు కోసం బయలుదేరారు. ప్రభుత్వ బస్సు ఎక్కారు. కేజీ కండ్రిగ సమీపంలో వెళుతుండగా ఓ టిప్పర్‌ మృత్యురూపంలో ముంచుకొచ్చింది. దీంతో వారి బతుకులు అక్కడే తెల్లారిపోయాయి. వారి బంధువుల అర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
● ప్రభుత్వ బస్సును ఢీకొన్న టిప్పర్‌ ● నలుగురి కూలీలు దుర్మరణం ●30 మందికి గాయాలు

తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని రాష్ట్ర రహదారిలో టిప్పర్‌ అతి వేగంగా వచ్చి ప్రభుత్వ బస్సును ఢీకొన్న సంఘటనలో నలుగురు కూలీ కార్మికులు మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేజీ కండ్రిగలో శుక్రవారం శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. తిరుత్తణి ప్రభుత్వ బస్సు డిపోకు చెందిన టౌన్‌ బస్సు మహాన్‌కాలికాపురం నుంచి తిరుత్తణికి శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరింది. బస్సు డ్రైవర్‌గా బాలాపురం ప్రాంతానికి చెందిన జగన్నాథన్‌, కండక్టర్‌గా ఆర్కేపేటకు చెందిన శ్రీనివాసన్‌ విధులు నిర్వహించారు. అమ్మయార్‌కుప్పం గ్రామానికి చెందిన 35 మంది చైన్నెలో వంట పనులు సహాయకులుగా పనులు చేసేందుకు ఆ బస్సులో ప్రయాణించారు. మొత్తం 55 మంది బస్సు బయలుదేరింది. కేజీ.కండ్రిగ బస్టాండ్‌కు సమీపంలో తిరుత్తణి వైపు వెళుతున్న బస్సును తిరుత్తణి నుంచి పళ్లిపట్టు క్వారీకి వెళుతున్న టిప్పర్‌ లారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సులో ముందు వరుసలో కూర్చుని ఉన్న ప్రయాణికులు టిప్పర్‌, బస్సు మధ్యలో చిక్కుకున్నారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో అటువైపు వెళుతున్న ప్రయాణికులు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాపాడి 108 ఆంబులెన్స్‌ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో అమ్మయార్‌కుప్పం గ్రామానికి చెందిన నేత కార్మికులు మురళి(34), మహేష్‌(35), పాండురంగన్‌(45), శివానందం(55) మృతిచెందారు. ఇద్దరు చిన్నారులు, మహిళలు సహా 30 మందికి గాయాలయ్యాయి. వీరంతా తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చైన్నె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు

ఆస్పత్రి ఆవరణలో మృతుల బంధువులు, కుటుంబసభ్యులతోపాటు గాయపడిన వారి బంధువులు రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రి వద్ద బోరుమని విలపించడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

టిప్పర్‌ డ్రైవర్‌ పరారీ

ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ పరారీ కావడంతో తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పరామర్శ

తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి నాజర్‌, జిల్లా కలెక్టర్‌ ప్రతాప్‌ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కాగా మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాగా రూ.3లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కూలిన బతుకులు1
1/6

కూలిన బతుకులు

కూలిన బతుకులు2
2/6

కూలిన బతుకులు

కూలిన బతుకులు3
3/6

కూలిన బతుకులు

కూలిన బతుకులు4
4/6

కూలిన బతుకులు

కూలిన బతుకులు5
5/6

కూలిన బతుకులు

కూలిన బతుకులు6
6/6

కూలిన బతుకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement