తమిళంలో పరీక్షలకు చర్యలు తీసుకోండి!
సాక్షి, చైన్నె: వైద్యం, ఇంజినీరింగ్ కోర్సుల్లో పరీక్షలను తమిళంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా సూచించారు. సీఐఎస్‌ఎఫ్ ఎంపిక పరీక్షలను తమిళంలో నిర్వహించేందుకు తాము చర్యలు తీసుకున్నామన్నారు. సీఐఎస్‌ఎఫ్ 56వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని తక్కోళంలో జరిగింది. ఇక్కడి సీఐఎస్‌ఎఫ్ శిక్షణ కేంద్రంలో జరిగిన వేడుకల్లో శిక్షణ పూర్తిచేసుకున్న బృందాల విన్యాసాలు అదరహో అనిపించాయి. ఈ వేడుకకు అమిత్‌షా హాజరయ్యారు. సీఐఎస్‌ఎఫ్ బృందాల నుంచి పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. విన్యాసాలను తిలకించారు.
మహిళా బెటాలియన్
ఈ వేడుకల్లో అమిత్‌షా మాట్లాడుతూ, సీఐఎస్‌ఎఫ్ కోసం మూడు బెటాలియన్లను దేశ వ్యాప్తంగా ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, ఇందులో ఒక బెటాలియన్ పూర్తిగా మహిళలతో కూడుకున్నదిగా ఉంటుందని ప్రకటించారు. 2027 నాటికి అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ఆర్థిక, భద్రతా పరంగా మూడో స్థానంలో నిలబెట్టే దిశగా ప్రధాని మోదీ విస్తృత కార్యాచరణతో ముందుకెళ్తున్నారన్నారు. ఇందులో భాగంగా సీఐఎస్‌ఎఫ్‌ను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా ఈ విభాగంలో డ్రాగన్ నిఘాకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇటీవల కేంద్రం 14 వేల మందిని ఎంపిక చేసిందని గుర్తుచేశారు. దేశంలో మెట్రో, విమానాశ్రయం, హార్బర్, ఇలా అన్ని చోట్ల సీఐఎస్‌ఎఫ్ భద్రత నిఘాకు పూర్తి స్థాయిలో నియమించి ఉత్తమ సేవల మీద దృష్టిపెట్టనున్నామని తెలిపారు. సీఐఎస్‌ఎఫ్ భద్రత ఉత్తమం అని చాటే విధంగా ముందుకెళ్తామన్నారు. ఇది వరకు సీఐఎస్‌ఎఫ్ ఎంపిక పరీక్ష హిందీ, ఆంగ్లంలో జరిగేదని, ప్రస్తుతం తమిళం, బెంగాళి భాషల్లో నిర్వహణకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదే దిశలో తమిళనాడు ప్రభుత్వానికి తానో సూచన చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైద్యం, ఇంజినీరింగ్ కోర్సులను తమిళంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడు విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ముందుగా సైక్లోథాన్ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా అమిత్ షా ప్రారంభించారు. ఇందులో ఒకటి గుజరాత్ నుంచి మరొకటి పశ్చిమబెంగాల్ నుంచి కన్యాకుమారి వైపుగా బయలుదేరాయి.
రాష్ట్రానికి కేంద్ర మంత్రి సూచన
ఘనంగా సీఐఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment