● పళణి స్వామి ధీమా
మహిళల ఆదరణతో
అధికారంలోకి వస్తాం!
సాక్షి, చైన్నె: మహిళల ఆదరణతో 2026 ఎన్నికలలో అధికారంలోకి వస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణి స్వామి ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలో రాయపేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన పళణి స్వామి మహిళా లోకం బ్రహ్మరథం పట్టాయి. పార్టీ మహిళ నేతలు వలర్మతి, గోకుల ఇందిర తదితరుల నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం ఆవరణలో దివంగత నేత అమ్మ జయలలిత విగ్రహానికి పళణిస్వామి అంజలి ఘటించారు. అలాగే దివంగత నేత ఎంజీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. మహిళలందరికీ శుఽభాకాంక్షలు తెలుపుతూ ముందుకు వెళ్లారు. పార్టీ కార్యాలయంలో పేద మహిళలకు కుట్టుమిషన్లు, ఇడ్లీ పాత్రులు, తదితర పలురకాల వస్తువులను అందజేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ కేక్‌ను కట్ చేసి అందరికి పంచి పెట్టారు. ఈ సందర్భంగా పళణి స్వామి మాట్లాడుతూ దివంగత అమ్మ జయలలిత పాలనలో రాష్ట్రంలోని మహిళలు అందరికీ భద్రత రెట్టింపుగా ఉండేదన్నారు. ఆమె అడుగు జాడలలో గత ప్రభుత్వం అదే భద్రతను కొనసాగించిందన్నారు. అయితే ప్రస్తుతం డీఎంకే పాలన మహిళల భద్రతను ప్రశ్నార్థకంచేసిందన్నారు. దేశానికి కళ్లు లాంటి వారైన మహిళకు ఈ రాష్ట్రంలో కనీస భద్రత లేదని, వారిపై అఘాయిత్యాలు పెరిగి పోయాయయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థిక బలోపేతంతో గతంలో ముందుకు సాగితే, ఇప్పుడు ఆర్థిక కష్టాలు తప్పడం లేదని ధ్వజమెత్తారు. మహిళలు ఈ పాలన మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారి ఆదరణతో రానున్న ఎన్నికలలో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, తమతో పొత్తుకు పార్టీలు తపస్సు చేస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాంగ్యాస్త్రంగా చేసిన వ్యాఖ్యల గురించి పళణి స్వామిని ప్రశ్నించగా, ఆయన అన్నాడీఎంకే పేరును ప్రస్తావించారా? అనిఎదురు ప్రశ్న వేశారు. ఆయన ఏమి చెప్పారో సమగ్రంగా పరిశీలించాలే గానీ, ఎందుకు అనవసరంగా వివాదాలు, ప్రచారాలు, చర్చలు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
● పళణి స్వామి ధీమా
Comments
Please login to add a commentAdd a comment