రూ.74 కోట్లతో 114 ఆలయ రథాల నిర్మాణం
● మంత్రి శేఖర్‌బాబు వెల్లడి
కొరుక్కుపేట: డీఎంకే బాధ్యతలు చేపట్టిన తరువాత రూ.74 కోట్లు వ్యయంతో 114 కొత్త ఆలయ రథాలను నిర్మించామని రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖామంత్రి శేఖర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అంబత్తూరు పాడీలోని తిరువల్లీశ్వరర్, కై లాసనాథర్ దేవాలయాలల్లో నూతన రథం నిర్మాణం, పునరుద్ధరణ పనులను రూ. 3 కోట్ల 49 లక్షల రూపాయలతో చేపడుతున్నారు. ఈ పనుల ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో హిందూ ధార్మిక శాఖ మంత్రి శేఖర్‌బాబు పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబత్తూరు ఎమ్మెల్యే జోసెఫ్ శామ్యూల్, హిందూ ధర్మాదాయ శాఖ కమిషనర్ పీఎనన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ ముల్లై, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, అంపత్తూరు జోనల్ కమిటీ చైర్మనన్ పీకే మూర్తి, తిరువళ్లేశ్వరర్ ఆలయ ధర్మకర్త కమిటీ చైర్మన్ వనవిల్ విజయ్, ప్రాంతీయ కార్యదర్శి ఎండీ ఆర్.నాగరాజ్, బోర్డు సభ్యులు డీఎస్పీ రాజగోపాల్, డా.పూర్ణిమ. నాగవల్లి ప్రభాకరన్, ఉమా సంతానం, కార్యనిర్వహణాధికారులు కుమరన్, శశికుమార్, భక్తులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి శేఖర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ.. హిందూ ధార్మిక సంక్షేమ శాఖ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమలుకు అనేక పనులకు డిఎంకే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని తెలిపారు. డీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూ. 74 కోట్లతో 114 రథాలను కొత్తగా నిర్మించామని.. మరమ్మతుల కోసం రూ.16 కోట్లతో 64 రథాలు చేపట్టి పనులు పూర్తి చేస్తున్నట్టు వెల్లడించారు.
అంతా రాజకీయమే!
–మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
కొరుక్కుపేట: తమిళనాడులో హిందీ కచ్చితమని చెప్పలేదని, ఇదంతా రాజకీయ అలజడి మాత్రమేనని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో తమిళ భాష విషయానికి వస్తే కొత్త జాతీయ విద్యా విధానం తమిళ మాధ్యమం నేర్చుకోవాలనే నొక్కి చెబుతోందన్నారు. తమిళనాడులో చాలా చోట్ల తమిళంలో విద్య కనుమరుగవుతోందని, దీనికి స్వస్తి పలకాలంటే కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి అన్నారు. త్రిభాషా సూత్రం విషయానికి వస్తే, మీరు మూడవ భాషగా ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. కొత్త జాతీయ విద్యా విధానంలో ఏ భాషనూ విధించలేదని గ్రహించాలి అని, తమిళనాడుకు సంబంధించినంత వరకు అంతా రాజకీయం మాత్రమే అని, హిందీని ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పలేదని పేర్కొన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం తమిళనాడుకు మాత్రమే రావడం లేదు. అన్ని రాష్ట్రాలకు చెందింది. బిహార్ ప్రజలు తమిళం నేర్చుకోవాలనుకుంటే కచ్చితంగా తమిళం నేర్చుకుంటారు. కానీ తమిళం వారిపై రుద్దరు. హిందీని విధించకూడదని చెప్పినట్లే, ఇతర రాష్ట్రాల ప్రజలపై తమిళాన్ని రుద్దలేం. కొత్త జాతీయ విద్యా విధానంలో ఏ భాష ఎవరిపైనా రుద్దకూడదు అన్నదే ప్రధానంగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. యువత డ్రగ్స్‌కు అలవాటు పడడమే ఇందుకు ప్రధాన కారణం. తమిళనాడు ప్రభుత్వం గంజాయిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే లైంగికదాడుల సమస్యలను అరికట్టవచ్చన్నారు.
బస్సును
ఢీకొన్న కారు
– రైతు దుర్మరణం
సేలం : గోపి సమీపంలో పోలవక్కాలిపాళయంకు చెందిన రైతు గోవిందరాజ్ (60). ఇతను తన మామ ముత్తుస్వామిని సెంబుత్తాం పాళయంకు కారులో తీసుకువెళ్లి వదిలిపెట్టి ఆదివారం సాయంత్రం అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. దాసంపాళయం అనే ప్రాంతంలో వస్తుండగా రోడ్డు పక్కన ఒక ప్రైవేటు కళాశాల బస్సు నిలపబడి ఉంది. అకస్మాత్తుగా ఆ బస్సును వెనుక వైపుగా గోవిందరాజ్ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గోవిందరాజ్ కారు శిథిలాలలో చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న గోపి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న కారును బయటకు తీసి చూడగా కారులో శరీరం నుజ్జునుజ్జయిన స్థితిలో గోవిందరాజ్ మృతి చెంది కనిపించాడు. తర్వాత గోవిందరాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం గోపి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment