పూందమల్లి – పోరూర్ మధ్య మెట్రో పనులు పూర్తి
సాక్షి, చైన్నె: ఫేజ్ –2లో భాగంగా చైన్నెలో పూందమల్లి – పోరూర్ మధ్య మెట్రో రైలు పనులు ముగించారు. ఎత్తయిన వంతెన మార్గంగా నిర్మాణాలు జరిగాయి. త్వరలో డ్రైవర్ రహిత మెట్రోరైలు ఈ మార్గంలో ట్రయల్ రన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజధాని నగరం చైన్నెలో ఫేజ్ 1 పనులు ముగియడంతో విమానాశ్రయం నుంచి కోయంబేడు మీదుగా సెంట్రల్‌కు, సెయింట్‌థామస్ మౌంట్ – ఆలందూరు – సెంట్రల్ మీదుగా విమ్కో నగర్‌కు మెట్రో రైలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవలకు అమిత స్పందన రావడంతో ఫేజ్– 2లో మరో మూడు మార్గాలుగా మాదవరం – సిరుచ్చేరి , మాదవరం – షోళింగనల్లూరు, పూందమల్లి – లైట్ హౌస్‌లను ఎంపిక చేసి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మార్గంలో డ్రైవర్ రహిత మెట్రో రైలు నడిపేందుకు అధికారులు కసరత్తులు చేపట్టారు. ఇందుకోసం తమిళనాడు సరిహద్దులలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలో ఉన్న శ్రీసిటీలో 108 బోగీలతో 36 డ్రైవర్ రహిత మెట్రో రైళ్ల తయారీ పనులు ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇందులో మూడు బోగీలతోకూడిన రెండు డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు చైన్నె పూందమల్లి వర్క్ షాపుకు చేరాయి. ఇక్కడ 900 కి.మీ దూరం ఏర్పాటు చేసిన ట్రాక్‌పై ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ పరిస్థితులలో పూందమల్లి నుంచి పోరూర్ వరకు 9 కి.మీ దూరం మెట్రో పనులు ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. ఎత్తయిన వంతెన మార్గంగా ఈ నిర్మాణాలు జరిగినట్టు, ప్రధానంగా పోరూర్ సమీపంలోని జాతీయ రహదారిని అనుసంధానించే విధంగా ఎత్తయిన రెడీమెడ్ వంతెన ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు. ఈ మార్గంలో పనులు ముగిసి నేపత్యంలో త్వరలో డ్రైవర్ రహిత రైలును ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇదేమార్గంలో పోరూర్ నుంచి వడపళణి వరకు వంతెన మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వడపళణి సమీపంలోని పవర్ హౌస్ నుంచి లైట్ హస్ వరకు రైలు భూగర్భ మార్గంలో పయనించే రీతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. వడపళణి సమీపంలోని డబుల్ డెక్కర్ వంతెనమార్గంగా నిర్మాణాలు జరుగుతుండడం విశేషం. ఇదే వేగంతో సాగిన పక్షంలో 2026లో ఈమార్గంలో మెట్రో రైలు సేవలకు అవకాశం ఉంది. పూందమల్లి – పోరూర్ మార్గంలో పనులు ముగియడంతో ఇక్కడ పనిచేసిన ఇంజినీర్లు, ఇతర అధికారులను మెట్రో ఉన్నతాధికారి అర్జునన్ సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment