పీఎంకే మాదిరి బడ్జెట్ విడుదల
సాక్షి, చైన్నె: పీఎంకే నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక మాదిరి బడ్జెట్‌ను సోమవారం విడుదల చేశారు. దిండివనంలోని పార్టీ కార్యాలయంలో ఈ బడ్జెట్‌ను ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ప్రకటించారు. 2025–26లో తమిళనాడు ఆదాయ వసూళ్లు రూ.5,43,442 కోట్లుగా పేర్కొన్నారు. ఇది గత సంవత్సరం ఆదాయం కంటే రూ.1,91,602 కోట్లు ఎక్కువ అని వివరించారు. ఖనిజ వనరుల సమర్ధవంతమైన నిర్వహణ ద్వారా రూ .2,02,010 కోట్ల పన్నుయేతర ఆదాయాన్ని సాధించాలన్న ప్రణాళిక పెరుగుదలకు కారణంగా పద్దులు చూపించారు. తమిళనాడులో 1.20 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, గత 4 సంవత్సరాలలో 70,000 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. వీరిలో 37,026 మందికి మాత్రమే శాశ్వత ఉద్యోగాలు ఇవ్వగా , 33,655 మందికి తాత్కాలిక , కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. తమిళనాడులోని ప్రభుత్వ విభాగాల్లో 6.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ, వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా ప్రణాళిక , వైద్య సేవలు, విద్యా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, మాన వనరుల పెంపులక్ష్యంగా 6వ తరగతి నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా జనాభా లెక్కలు నిర్వహించడానికి రూ . 400 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంటూ, జూలై 2025 నుంచి తమిళనాడులో కులాల వారీగా జనాభా గణన ప్రారంభించాలన్నారు. వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదిక ఆధారంగావ వన్నియర్లకు రిజర్వేషన్ కల్పన, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను మాదిరి బడ్జెట్‌లో వివరించారు.. తమిళనాడులోని స్టేట్‌బోర్డు పాఠశాలల్లో 10వ తరగతి వరకు తమిళాన్ని తప్పనిసరి బోధనా మాధ్యమంగా మార్చడానికి ఒక చట్టం అమలు చేయడం, తమిళంలో నేమ్ బోర్డులు లేని దుకాణాలకు రూ . 10,000 జరిమానా విధించడం, వ్యాపార లైసెన్స్‌లు రద్దు చేయడం, పిల్లలకు పేర్లు పెట్టడంకోసం ప్రత్యేక తమిళ పేర్ల జాబితాను విడుదల చేయడం,ప్రభుత్వ ఉద్యోగాలు తమిళ మాధ్యమంలో చదివిన వారికి మాత్రమే ప్రాధాన్యత, తమిళ మాధ్యమంలో చదువుకున్న వారికి ఉన్నత విద్యలో 30 శాతం రిజర్వేషన్లు అమలు వంటి సూచనలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి పాత పెన్షన్ పథకం అమలు, ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత , తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం వంటి 73 అంశాలతో పలు సూచనలు,సలహాలు, ఆర్థిక సంబంధిత నివేదికలు, పథకాలను ఈ మాదిరి బడ్జెట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment