చైన్నె నుంచి తిరుచ్చి, తూత్తుకుడిలకు అదనపు విమానాలు
కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయం నుంచి తిరుచ్చి, తూత్తుకుడిలకు అదనపు విమానాలు నడుపనున్నట్టు విమానాశ్రయ అఽధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి తూత్తుకుడికి ఇప్పటికే 8 విమానాలు నడుస్తున్నాయి. ఈ నెల 30వ తేది నుంచి వీటిని 12కు పెంచనున్నారు. అలాగే తిరుచ్చికి ఈ నెల 22 నుంచి 16 సర్వీసులను పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఇదలా ఉంచితే తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో సౌకర్యాలు లేకపోవడంతో బస్సుల్లో వారాంతం రోజుల్లో అక్కడికి వెళ్లే ప్రైవేట్ ఓమ్నీ చార్జీలు విమాన చార్జీలతో సమానంగా వసూలు చేస్తున్నారు. దీంతో విమానాల్లో వెళ్లడం బెటరని చైన్నె విమానాశ్రయం నుంచి తిరుచ్చి, మధురై, సేలం, తూత్తుకుడి వెళ్లే విమానాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయని అధికారులు వెల్లడించారు.
హౌసింగ్ బోర్డులో ఇల్లు పేరిట మోసం
తిరువొత్తియూరు: చైన్నె, సేతుపట్టులో స్లం క్లియరెన్‌న్స్ విభాగంలో ఇల్లు తీసిస్తానని ఒక మహిళ వద్ద రూ 2.2 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సేతుపట్టు జగన్నాధపురం రెండవ వీధికి చెందిన దేవిక (40 చింతాద్రి పేటలో నివాసముంటున్న సమయంలో వినోద్ కుమార్ అనే అతను పరిచయమయ్యాడు. చైన్నె కార్పొరేషన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇల్లు తీసిస్తామని సమ్మబలికి, ఆమె నుంచి వినోద్ కుమార్ రూ 2.2 లక్షలు రెండు విడతలుగా తీసుకున్నాడు. అయితే ఏళ్లు గడిచినా ఇల్లు తీసివ్వకపోవడం, నగదు తిరిగి ఇవ్వాలని కోరినా బెదిరింపులకు దిగడంతో బాధితురాలు చింతాద్రిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్ కుమార్‌ను ఆదివారం అరెస్టు చేశారు.
పెదనాన్నను హత్య కేసులో యువకుడి అరెస్టు
సేలం : పెదనాన్నను హత్య చేసిన యువకుడిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. చెంగల్పట్టు జిల్లా చెన్నేరి గ్రామానికి చెందిన పశువుల వ్యాపారి రవి (45). రెండురోజుల క్రితం రవిని తమ్ముడి కుమారుడు కామేష్ (23) కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రవి రక్తపు మడుగులో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆ సమయంలో అడ్డుకున్న రవి స్నేహితుడు నరసిమ్మన్ (70) కూడా కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో కామేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన విచారణలో మత్తుకు అలవాటుపడిన కామేష్ చెన్నేరి అడవి ప్రాంతంలో దాగి ఉన్నట్టు తెలిసింది. ఈక్రమంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వేమన పద్యాలతో ఆకట్టుకున్న చిన్నారులు
కొరుక్కుపేట: వేమన పద్యాలతో, సైన్స్ ప్రశ్నావళి పోటీల్లో చిన్నారులు తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైన్నె తిరువోత్తియూర్‌లో ఉన్న ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ నిర్వహిస్తున్న శ్రీ రామకృష్ణా ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు పోటీలను నిర్వహించారు. తెలుగు వెలుగు అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో చిన్నారులకు వేమన పద్యాల పోటీ, సైన్స్ ప్రశ్నావళి పోటీలను నిర్వహించగా , చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పద్యాలతో ఆలరించగా , సైన్స్ ప్రశ్నావళిలోనూ ప్రతిభను చాటుకున్నారు . విజేతలకు బహుమతులతోపాటు పాఠశాలోని ప్రతీ విద్యార్థికి కథలు పుస్తకాలు , స్వీట్లు పంచిపెట్టిన అల్లింగం రాజశేఖర్ మాతృభాషావికాసానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు . తెలుగు మాధ్యమంలో చదివించేందుకు తల్లిదండ్రులను కోరారు. తనవంతుగా ప్రతీ స్కూల్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు . కార్యక్రమంలోభాగంగా స్కూల్ ఉపాధ్యాయురాలు బి. శ్వేతకు పార్వతీ పరమేశ్వరుని ఫొటోని బహుకరించి సత్కరించారు. ఇందులో ప్రదానోపాధ్యాయురాలు అపర్ణ , విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment