విద్యార్థిపై కత్తులతో దాడి
సేలం : తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలో ఉన్న అరియనాయకిపురానికి చెందిన తంగ గణేష్. ఇతని కుమారుడు దేవేంద్రన్ (17). ఇతను నెల్‌లైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లడం కోసం ఊరిలో ఉన్న బస్ స్టాండ్ నుంచి బస్సు ఎక్కి శ్రీవైకుంఠంకు బయలుదేరాడు. అరియనాయకిపురం తర్వాత ఊరు రెడ్డియమ్మాల్‌పురం ప్రాంతంలో బస్సు వెళుతుండగా అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ముగ్గురు బస్సును అడ్డుకుని, బస్సులో ఎక్కారు. ఆ ముఠా బస్సులో ఉన్న దేవేంద్రన్‌ను కిందకు లాగి కత్తులతో తల, చేతులు, కాళ్ల, శరీరంపై నరికారు. తీవ్రంగా గాయపడిన దేవేంద్రన్ రక్తపు మడుగులో కుప్పకూలాడు. సమాచారం అందుకున్న శ్రీవైకుంఠం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు పోరాడుతున్న దేవేంద్రన్‌ను చికిత్స నిమిత్తం శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతనికి అక్కడ ప్రాధమిక చికిత్స చేసి, ఉన్నత చికిత్స నిమిత్తం నెల్‌లై ప్రభుత్వ ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు కోణాలలో విచారణ జరుపుతూ, ముగ్గురు ముఠా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment