ధర్మేంద్రతో ఢీ...!
● నోరు జారిన కేంద్ర మంత్రి
● కనిమొళి అసహనం
● సీఎం ఆగ్రహం
సాక్షి, చైన్నె: కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో డీఎంకే ఎంపీలు పార్లమెంట్ వేదికగా సోమవారం ఢీ కొట్టారు. ఈ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలను తమిళనాడులోని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆయన వ్యాఖ్యలను సీఎం స్టాలిన్ ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. వారణాసిలో గత నెల జరిగిన కాశీ తమిళ సంఘం సమావేశానంతరం మీడియాతో కేంద్ర ఉన్నతవిద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే. బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ డీఎంకే కూటమి పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నాయి. తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ నిధులు అడిగితే, జాతీయ విద్యావిధానం మేరకు త్రిభాషను అమలు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తారా? అంటూ పార్లమెంట్ వేదికగా డీఎంకే ఎంపీలు కేంద్ర మంత్రిని నిలదీశారు. డీఎంకే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆదివారం తీసుకున్న నిర్ణయంమేరకు కేంద్రంతో ఢీకొట్టే విధంగాపార్లమెంట్ సెకండ్ సెషన్స్ తొలిరోజే డీఎంకే ఎంపీలు దూకుడుగా ముందుకెళ్లారు. సర్వ శిక్ష అభియాన్ నిధులకు బ్రేక్ వేయడాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే ఎంపీ తమిళళచ్చి తంగ పాండియన్ సభలో వ్యాఖ్యల తూటాలను అందుకోగా, కేంద్ర మంత్రి ఏమాత్రం తగ్గకుండా ఎదురు దాడి చేశారు. అయితే డీఎంకే ఎంపీలను ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్య వివాదానికి దారి తీసింది. తమను అనాగరికులతో పోల్చుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి సభలో తీవ్రంగా ఖండించడమే కాకుండా తమ నిరసనను ఆ పార్టీ ఎంపీలు తెలియజేయడంతో సభా వ్యవహారాలు స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు ఢిల్లీ వేదికగా జరిగితే, తమ ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకండా డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని అందుకున్నాయి. ఇదేనా నాగరికం అని వ్యాఖ్యల తూటాలు పేల్చాయి. అదే సమయంలో ఢిల్లీ వేదికగా పార్లమెంట్‌లో మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా, తమిళులలో మాత్రం ఆగ్రహం తగ్గడం లేదు.
సీఎం ఫైర్..
ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను సీఎం స్టాలిన్‌తో పాటూ డీఎంకే కూటమిపార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమం వేదికగా సీఎం స్టాలిన్ స్పందిస్తూ, తనను తాను రాజుగా భావించి అహంకారంతో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతున్నట్లుందని మండిపడ్డారు. తమిళనాడుకు నిధులు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుందా, తమ ఎంపీలతో దురుసుగా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ దీనిని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేస్తామని ఏ సమయంలోనూ తాము చెప్పలేదని, ఆదిలోనే తిరస్కరించామన్న విషయాన్ని మంత్రి గుర్తెరగాలని హితవు పలికారు. తప్పుడు సమాచారాలు ఇవ్వడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. తాముప్రజల గురించి ఆలోచిస్తున్నామని, తమ విద్యార్థుల సంక్షేమమే ముఖ్యం అని పేర్కొంటూ, మళ్లీ మళ్లీ అవమానించినా, మోసాలు చేసే ప్రయత్నం చేసినా తమ ఆగ్రహాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యామంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ, త్రిభాషా విధానాన్ని సీఎం అంగీకరించినట్టు, సూపర్ సీఎం అడ్డు పడినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు చేశారని, ఇంతకీ ఆ సూపర్ సీఎం ఎవరో ఆయన స్పష్టం చేయాలని డిమాండ్‌చేశారు. ఇదే అంశాన్ని తమిళనాడులోని డీఎంకే, కూటమి పార్టీల నేతలందరూ నినాదిస్తూ సూపర్ సీఎం ఎవరో అన్నది మంత్రే చెప్పాలని నినాదాలు అందుకున్నారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ, కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ, ఆ వ్యాఖ్యలను మళ్లీ తెర మీదకు తీసుకు రావడం నాగరికమా.. అని డీఎంకే వర్గాలను, సీఎంను ఉద్దేశించి ప్రశ్నించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment