ఢిల్లీలో తమిళ ఎంపీల నిరసనల హోరు
సాక్షి, చైన్నె: పార్లమెంట్ వేదికగా తమిళ ఎంపీలను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, తమిళనాడుకు విద్యా నిధుల పంపిణీకి డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం జరిగింది. పార్లమెంట్ ఆవరణలో డీఎంకే ఎంపీ కనిమొళి, ఎండీఎంకే ఎంపీ వైగో, వీసీకే ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలో డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ , వీసీకే తదితర రాష్ట్రానికి చెందిన 39 మందితోపాటూ పుదుచ్చేరి కాంగ్రెస్ ఎంపీ ఈ నిరసనలో పాల్గొన్నారు. తమిళ ఎంపీలను కించపరిచిన ధర్మేంద్ర ప్రదాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఇదిలా ఉండగా ధర్మేంద్ర ప్రదాన్‌కు వ్యతిరేకంగా తమిళనాట నిరసనలు హోరెత్తాయి. ఆయన దిష్టిబొమ్మలను డీఎంకే వర్గాలు దగ్ధం చేశారు. ఈ నిరసనలలో పాల్గొన్న డీఎంకే వర్గాలు 11 వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అకాల వర్షంతో ఆహ్లాదం
సాక్షి, చైన్నె: వేసవిలో అకాల వర్షం పలకరించింది. మంగవారం రాష్ట్రంలో పలు జిల్లాలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపం చైన్నె, శివారు జిల్లాలతో పాటూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో అధికంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం తూత్తుకుడి, తెన్‌కాశి, తిరునల్వేలిలలో వాతావరణం చల్లబడినట్టు పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో మంగళవారం ఉదయం నుంచి చైన్నె, శివారులలో తెర పించి తెరపించి చిరుజల్లుల వాన పడింది. కొన్ని సందర్భాలలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం పడింది. వర్షం కారణంగా భానుడు తెర మరుగయ్యాడు. వాతావరణం పూర్తిగా మారినట్లయ్యింది. ఇదే పరిస్థితి తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, కన్యాకుమారిలలో నెలకొంది. అక్కడక్కడ చెదురుముదురుగా వర్షం పడింది. మదురై, విరుదుగనర్, శివగంగైలతో పాటూ డెల్టా జిల్లాలు మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్‌లలో వర్షం పలకరించింది. ఈ వర్షాలు మరో రెండురోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రైలు బోల్తాకు కుట్ర?
– కోవైలో కలకలం
సేలం: సేలం రైల్వే డివిజన్ పరిధిలోని కోవై సింగానల్లూర్ రైల్వే స్టేషన్‌కు సోమవారం రాత్రి 10.15 గంటకు సేలం మార్గంలో తిరుపతి – కోవై ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. అప్పుడు పక్కన వెళుతున్న కోవై – సేలం రైలు మార్గంలో రైల్వే ట్రాక్‌పై అది పెద్ద కాంక్రీట్ ఉండడాన్ని లోకో పైలెట్ గమనించారు. దిగ్భ్రాంతి చెందిన ఆయన కోవై రైల్వే స్టేషన్ మాస్టర్‌కు, సేలం రైల్వే డివిజన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే కోవై ఆర్‌పీఎఫ్ పోలీసులు, కోవై రైల్వే పోలీస్ డీఎస్‌పీ బాబు ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న సింగానల్లూర్ రైల్వే గేట్ కీపర్ పట్టాలపై ఉన్న ఆ సిమెంట్ స్లాబ్‌లను తొలగించాడు. ఈ మార్గంలో సోమవారం రాత్రి కోవై నుంచి సేలం మార్గంలో వెళ్లే బెంగళూరూ – చైన్నె ఎక్స్‌ప్రెస్, మేట్టుపాళయం – చైన్నె నీలగిరి ఎక్స్‌ప్రెస్, ఎర్నాకుళం – పాట్నా ఎక్స్‌ప్రెస్, కోవై – చైన్నై చేరన్ ఎక్స్‌ప్రెస్ వంటివి వరుసగా వస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రైలు బోల్తా కొట్టేందుకు పథకం వేసిన విషయం తెలిసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సేలం రైల్వే డివిజన్ ఆర్‌పీఎఫ్ సహాయ కమిషనర్ రతీష్ బాబు, డీఎస్‌పీ బాబు అధ్యక్షతన పోలీసులు తీవ్ర విచారణ చేపట్టారు.
సీబీసీఐడీ కార్యాలయంలో ఎడప్పాడి భద్రతాధికారి
కొరుక్కుపేట: కొడనాడు హత్య దోపిడి కేసులో జయలలిత, ఎడప్పాడి పళనిస్వామిలకు భద్రతాధికారిగా పనిచేసిన వీర పెరుమాళ్ మంగళవారం కోయంబత్తూరులోని సీబీసీఐడీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వివరాలు.. నీలగిరి జిల్లా కోఠగిరి సమీపంలోని కోడనాథ్‌లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, శశికళకు చెందిన ఎస్టేట్, రెండు బంగ్లాలు ఉన్నాయి. 2017 చివరి నెలలో 11 మంది సభ్యుల ముఠా ప్రవేశించి సెక్యూరిటీ గార్డును హత్య చేసి దోపిడీకి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. సీబీసీఐడీ పోలీసులు గత వారం రాజన్, అన్నాడీఎంకే ప్రముఖులు శంకర్‌లను మరోసారి విచారించారు. దీంతో జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న కాంచీపురం రిటైర్డ్ ఏడీఎస్పీ వీరపెరుమాళ్‌ను మంగళవారం హాజరుకావాలని సమన్లు సీబీసీఐడీ కోయంబత్తూరుకు పంపింది. తదనుగుణంగా అతను విచారణకు హాజరయ్యాడు. మంగళవారం ఉదయం 10 గంటలకు సీబీసీఐడీ అధికారులు అతడిని విచారించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వీడియోలో రికార్డయ్యాయి. అలాగే గురువారం (13వ తేదీ) జయలలిత సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన భవానీ నుంచి రిటైర్డ్ ఏడీఎస్పీ పెరుమాల్‌ను స్వయంగా హాజరుకావాలని సమన్లు పంపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment