ఇళయరాజకు బ్రహ్మరథం
● 000
సాక్షి, చైన్నె: ఆసియాలోనే ఎవరూ సాధించని ఘనతను లండన్ వేదికగా లైవ్ సింఫోనితో సొంతం చేసుకుని చైన్నెలో అడుగు పెట్టిన సంగీతజ్ఞాని ఇళయరాజకు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, అధికారులు అధికారిక ఆహ్వానం పలికారు. సంగీతజ్ఞాని ఇళయరాజ ఈనెల 8న లండన్‌లో తొలిసారిగా లైవ్ సింఫనీ కచ్చేరి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసియాలోనే ఎవ్వరూ సాధించని ఈ ఘనతను ఇళయరాజా సొంతం చేసుకోవడంతో ఆయనకు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఉదయాన్నే చైన్నెకు చేరుకున్న సంగీత జ్ఞానికి విమానాశ్రయంలో ఘన స్వాతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఓ వైపు అధికారిక ఆహ్వానం పలికారు. మరోవైపు బీజేపీ, వీసీకే తదితర పార్టీలు, సంఘాలు, అభిమానులు దూసుకొచ్చి ఇళయరాజను అభినందిస్తూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇళయ రాజమాట్లాడుతూ, మనస్సు పులకించిందన్నారు. తనకు అధికారిక ఆహ్వానంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. సింఫోని లైవ్ మరో 13 దేశాలలో జరగనున్నాయని వివరించారు. అక్టోబరు 6న దుబాయ్‌లో, సెప్టెంబరు 6న ప్యారీస్‌లో ఆ తర్వాత జర్మన్ తదితర దేశాలలో ఈ కార్యక్రమాలు జరగనున్నట్టు పేర్కొన్నారు. ఈ సంగీతం దీంతో ఆగదు అని, ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతుందన్నారు. తనకు 82 ఏళ్లు అవుతోందని, ఈ వయస్సులో ఏమిచేస్తాడో అని అనుకోవద్దని, పన్నైపురం నుంచి వచ్చినప్పడు చెప్పులు కూడా లేకుండా వచ్చి తన కాళ్లపై నిలబడ్డానని, ఇప్పుడు కూడా అలాగే నిలబడి ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. యువత అర్థం చేసుకోవాలి.. దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి వారి విభాగాలలో ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఇక, తాను సంగీతకారుడిని అని, సంగీత దేవుడు అని తనను పిలవడం సబబుకాదన్నారు. తాను దేవుడ్ని కాదు.. సాధారణ మనిషిని అని వ్యాఖ్యానించారు. తనను దేవుడు అంటే, ఇళయరాజ స్థానానికి దేవుడిని తీసుకొచ్చేశారే అన్న భావన, వేదన కలుగుతోందన్నారు. త్వరలో తమిళనాడులోనూ సింఫోని జ్వలిస్తుందన్నారు. మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ, తమిళనాడు ఖ్యాతిని ఎలుగెత్తి చాటడమేకాకుండా, సంగీత ప్రపంచంలో ఎవ్వరూ సాధించని ఘనతను ఇళయరాజ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment