ఫెంగల్ బాధితులను ఆదుకోండి
● డీఎంకే, కాంగ్రెస్ డిమాండ్
సాక్షి, చైన్నె : ఫెంగల్ తుపాన్ సృష్టించిన విలయతాండవం మంగళవారం పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఇంత వరకు బాధితులకు నష్ట పరిహారం చెల్లించని పుదుచ్చేరి పాలకులు, కేంద్రంలోని ఏన్డీఏ పాలకుల తీరును ఖండిస్తూ డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వివరాలు.. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు సోమవారం లెప్టినెంట్ గవర్నర్ కై లాష్ నాథన్ ప్రసంగంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండవ రోజైన మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. సీఎం రంగస్వామి ప్రసంగించేందుకు సిద్ధం కాగా ప్రధాన ప్రతి పక్ష నేత (డీఎంకే)శివ లేచి ఫెంగల్ తుపాన్ బాధితులకు నష్ట పరిహారం మాటేంటి? అని ప్రశ్నించారు. ఇది సమయం కాదంటూ స్పీకర్ ఎన్బలం సెల్వం వారించారు. అయితే, డీఎంకే సభ్యులందరూ లేచి బాధితులకు నష్ట పరిహారం చెల్లించడంలో విఫలమైన ఈ పాలకుల తీరును ఖండిస్తున్నామని నినాదించారు. డీఎంకే నినాదాలతో కాంగ్రెస్ సభ్యులు సైతం తోడయ్యారు. దీంతో సభలో నినాదాలతో హోరెత్తియి. గందరగోళం నెలకొంది. సభను గాడిలో పెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించినా, డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు ఏమాత్రం తగ్గలేదు. ఫెంగల్ రూపంలో రైతులు తీవ్ర నష్టాలు, కష్టాలను ఎదుర్కొంటున్నా, ఇంత వరకు నష్ట పరిహారం అన్నది ఇవ్వక పోవడాన్ని ఖండిస్తున్నామని, కేంద్రంలోని ఎన్డీఏ పాలకులు ఈ వ్యవహారంలో అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి వెలుపలకు వచ్చేశారు. అనంతరం ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక, సభలో బుధవారం సీఎం రంగస్వామి బడ్జెట్ దాఖలు చేయనున్నారు. 2025–26 సంవత్సరంకు గాను పూర్తిస్థాయి బడ్జెట్‌దాఖలు కానుంది. 2026 ఎన్నికలకు సిద్ధం అయ్యేవిధంగా ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment