ఏనుగుదాడిలో యువకుడి మృతి
సేలం : నీలగిరి జిల్లాలో గత నెల మొత్తం అధిక మంచు కురిసినందువలన అడవి ప్రాంతంలో ఎండిగిపోయి కనిపిస్తోంది. అడవిలో ఉన్న నీటి ఆవాసాలు కూడా ఎండిపోయి కనిపించాయి. దీంతో అడవి ప్రాంతంలో నుంచి నీళ్లు, ఆహారం కోసం ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. ఈ స్థితిలో కున్నూర్ సమీపంలో దట్టమైన అడవి మధ్యలో సెంబక్కరై గ్రామంలో 50కి పైగా గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ క్రమానికి చెందిన ప్రజలు తమ నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయడం కోసం రోజూ కున్నూర్ నగర ప్రాంతానికి వచ్చి వెళుతున్నారు. సేపాక్కం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (30), అతని స్నేహితుడు రవి ఇద్దరు సోమవారం రాత్రి నగరానికి వచ్చి అత్యవసర వస్తువులు కొనుగోలు చేశారు. అనంతరం వారు గ్రామానికి తిరిగి వెళుతుండగా అటువైపుగా వచ్చిన అడవి ఏనుగు అకస్మాత్తుగా విజయ్ కుమార్‌పై దాడికి పాల్పడింది. దీంతో విజయ్ కుమార్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న కున్నూర్ అటవీ రేంజర్ రవీంద్రనాధ్ అధ్యక్షతన అటవీ శాఖ వారు ఆ ప్రాంతానికి వెళ్లి విజయ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవపంచనామా నిమిత్తం అంబులెన్స్ ద్వారా కున్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అడవి ఏనుగు దాడి గురించి కున్నూర్ అటవీ శాఖ అధికారులు, మేల్‌కున్నూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రూ. 50 వేలు పరిహారం అందజేత..
అడవి ఏనుగు దాడితో మృతి చెందిన వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కొరడా కె.రామచంద్రన్ మంగళవారం ఆస్పత్రికి వెళ్లి బంధువులకు ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నష్ట పరిహారాన్ని త్వరగా అందే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది. అదేవిధంగా కున్నూర్ అటవీ శాఖ తరపున మృతి చెందిన యువకుడి కుటుంబానికి తక్షణ నష్టపరిహారంగా రూ. 50,000 అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment