ట్రామా విజయం సాధించాలి
తమిళసినిమా: టర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎస్.ఉమామహేశ్వరి నిర్మించిన చిత్రం ట్రామా. నటుడు వివేక్ ప్రసన్న, నటి పూర్ణిమ రవి, ఆనంద్ నాగ్, చాందిని తమిళరసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. నిళల్ గళ్ రవి, మారి ముత్తు, ప్రదోష్, వైయాపురి, రమ, నమో నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా తంబిదురై మారియప్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఈయన ఒక కార్పొరేట్ ఉద్యోగి అన్నది గమనార్హం. అజయ్ శ్రీనివాస్ చాయాగ్రహణం, రాజ్ ప్రతాప్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈ నెల 21వ తేదీన తెరపైకి రానుంది. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఆల్ఫా 3 ఎంటర్‌టైనర్ సంస్థ అధినేత ఇళమారన్ పొంది విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రామా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని పీటీ త్యాగరాజన్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక నటుడు కే.భాగ్యరాజ్, నటుడు రాధారవి, మాజీ శాసనసభ్యురాలు విజయదారణి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు తంబిదురై మారియప్పన్ మాట్లాడుతూ తాను కథలు చేత పట్టి దర్శకుడిగా అవకాశాల కోసం చాలా మంది నిర్మాతల చుట్టూ తిరిగానని, ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో తన ఫ్రెండ్స్ సపోర్ట్ ద్వారా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఇది మూడు కథలతో కూడిన ఆంథాలజీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు కే.బాగ్యరాజ్ మాట్లాడుతూ ఎన్ని కథా చిత్రాలు రూపొందినా యువకులు ప్రేమించకపోయినా, ప్రేమ గురించే చర్చించుకుంటారని, అలాంటిది ఈ చిత్రం దర్శకుడు తంబిదురై తొలి ప్రయత్నంలోనే మూడు కథలతో కూడిన వైవిధ్య భరిత ఆంథాలజీ కథా చిత్రం చేయడం విశేషమని అన్నారు. ట్రామా అంటే అర్థం ఏమిటిని అడగ్గా బాధింపు అని దర్శకుడు చెప్పారన్నారు. యూనిట్ సభ్యులు ఎంతో శ్రమించి రూపొందించిన ఈ ట్రామా చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ట్రామా విజయం సాధించాలి
Comments
Please login to add a commentAdd a comment