2026 తరువాతే ఆ చిత్ర అప్‌డేట్
తమిళసినిమా: నటుడు విజయ్ ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న తన 69వ చిత్రం జననాయకన్ చివరిదనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడమే అదే విధంగా ఈయన ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీ 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతోంది. దీంతో ప్రస్తుతం విజయ్ తాను నటిస్తున్న చిత్రాన్ని ఎన్నికలకు ముందు తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన గోట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే గోట్ చిత్రం చివర్లో గోట్ వెర్సెస్ ఓజీ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వెంకట్ ప్రభును గోట్ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు? అసలు అది ఉంటుందా ? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ గోట్ చిత్రం సీక్వెల్ గోట్ వెర్సెస్ ఓజీ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ 2026 తరువాత ఉంటుందని పేర్కొన్నారు. దీంతో విజయ్ మళ్లీ నటించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన సమాధానం ఉండటంతో ఆయన అభిమానుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే వెంకట్ ప్రభు వ్యాఖ్యలపై నటుడు విజయ్ వర్గం ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు ప్రస్తుతం చైన్నె 28 చిత్రానికి పార్టు – 3 చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment