అన్నదాతపై.. వరాల జల్లు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతపై.. వరాల జల్లు

Published Sun, Mar 16 2025 2:01 AM | Last Updated on Sun, Mar 16 2025 1:56 AM

అన్నద

అన్నదాతపై.. వరాల జల్లు

వ్యవసాయ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ..

కష్టించే అన్నదాతకు ఆసరగా ఉండేందుకు.. ఆర్థిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌లో ప్రత్యేక కసరత్తు చేసింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అందించే పంటల బీమాకు భారీగా నిధులు కేటాయించింది. మొత్తం మీద దుక్కి దున్ని..నాట్లు వేసి పొలంలో చెమటోడ్చి పంటల సాగుబడితో అందరికీ అన్నం పెట్టే అన్నదాత సంక్షేమాన్ని కాంక్షించే విధంగా వ్యవసాయ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం శనివారం వ్యవసాయ పద్దును అసెంబ్లీలో దాఖలు చేశారు. పాత పథకాలకు 2025–26 సంవత్సరానికి గాను వివిధ ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా రూ. 45,661 కోట్ల నిధులను కేటాయించారు.

సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజున ఆర్థిక బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు దాఖలు చేశారు. రెండవ రోజున శనివారం వ్యవసాయ బడ్జెట్‌ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ రూపకల్పనలతో తనకు మద్దతుగా నిలిచిన అధికారులతో కలిసి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖమంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం తొలుత మెరీనా తీరంలోని అన్నా, కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి చేరుకుని సీఎం స్టాలిన్‌కు పేపర్‌ రహితంగా రూపకల్పన చేసిన బడ్జెట్‌ను ట్యాబ్‌ను అందజేశారు. అనంతరం సీఎం స్టాలిన్‌తో కలిసి అసెంబ్లీలో ఎంఆర్‌కే పన్నీరుసెల్వం అడుగు పెట్టారు. స్పీకర్‌ అప్పావు సభభలో రైతు బడ్జెట్‌ దాఖలకు అవకాశం కల్పించారు. దీంతో ఎంఆర్‌కే పన్నీరు సెల్వం బడ్జెట్‌ పద్దును వివరిస్తూ ప్రసంగించారు. సభకు వచ్చిన డీఎంకే సభ్యులు అందరూ తామంతా రైతులమే అని చాటే విధంగా రైతు ధరించే తువ్వాలను కండువగా రూపంలో ధరించి సభభలో కూర్చున్నారు. అయితే, సీఎం స్టాలిన్‌, సీనియర్‌ మంత్రి దురై మురుగన్‌, డిప్యూటీ సీఎం ఉదయ నిధిలు మాత్రం సాధారణంగానే కూర్చున్నారు.

రైతుల కీర్తి ప్రతిష్టలతో..

దేశానికి వెన్నెముకగా నిలిచి అందరికీ అన్నం పెట్టే అన్నదాత కీర్తి ప్రతిష్టల గురించి తమిళ మహాకవి తిరువళ్లువర్‌ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని ఎంఆర్‌కే పన్నీరు సెల్వం అందుకున్నారు. రైతుల జీవన పరిస్థితుల మెరుగు , వ్యవసాయ రంగంలో ఆధునికతను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. 2021 నుంచి నాలుగు సార్లు వ్యవసాయ బడ్జెట్‌ దాఖలు చేశానని, ఇది ఐదోసారి బడ్జెట్‌ అంటూ, ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానం, చేసిన ప్రకటనల మేరకు ప్రాజెక్టులు అద్భుతమైన రీతిలో అమలు చేశామని వివరించారు. ప్రస్తుతానికి వ్యవసాయం ఒక శాస్త్రం, సాంకేతికత అని పేర్కొంటూ, ఇందుకు మద్దతు ఇవ్వడం, అభివృద్ధి పరచడం గురించి వివరించారు. డిజిటల్‌ వ్యవసాయం గురించి ప్రస్తావిస్తూ కృత్రిమ మేధస్సు– వెబ్‌సైట్‌ సెన్సార్‌ టెక్నాలజీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌)తో రైతు శాసీ్త్రయ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నట్టు విశదీకరించారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయ ఉత్పత్తుల పెంపు, ఆధునీకత, వివిధ రకాల పంటల పై ప్రత్యేక దృష్టి వంటి అంశాలపై గత నాలుగేళ్లుగా తాము సాధించిన ఘనతను గుర్తుచేశారు. వ్యవసాయ యంత్రాల వినియోగం, విత్తనాలు, పంట కోత, గిడ్డంగులు, కొనుగోళ్లు వంటి అంశాలతో పాటుగా ఇప్పటి వరకు కేటాయించిన నిధులు, వెచ్చించిన విధానం గురించి వివరించారు. శ్రీభవిష్యత్తు యువత చేతుల్లో ఉందని పేర్కొంటూ, యువతలో వ్యవసాయంపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యచరణను విస్తృతం చేశామన్నారు.10,187 గ్రామాలలో యువత , రైతు సహకారంతో సాధించిన విజయాలను పేర్కొన్నారు. ఆది ద్రావిడ, గిరిజన , చిన్న, సన్న కారు రైతుల సంక్షేమం, సమీకృత వ్యవసాయం, గ్రీన్‌ హౌస్‌లు వంటి ప్రాజెక్టుల ద్వారా ఉపయోగకర అంశాలను ప్రస్తావించారు. వరి ఉత్పత్తి పెంపు, దిగుబడి పెంపు, చెరకు రైతుకు తోడ్పాటు, మద్దతు ధర గురించి గుర్తు చేస్తూ, రైతులకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా బడ్జెట్‌లో నిధులను కేటాయించామని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఎదురైన నష్టాలు, కష్టాలను గుర్తుచేస్తూ, నష్టాన్ని భర్తీ చేయడానికి 1,631 కోట్ల 53 లక్షల రూపాయలు నిధులు గత నాలుగు సంవత్సరాలలో కేటాయించామని, తద్వారా పంటల భీమా పరిహారం రూ. 5,242 కోట్లు రైతులకు దరి చేరిందన్నారు. చైన్నె ఆర్‌కే సాలైలలో కలైంజ్ఞర్‌ శత జయంతి స్మారకంగా ఏర్పాటు చేసిన బ్రహ్మాండ ఉద్యాన వనం గురించి గుర్తుచేస్తూ, ఇది అన్నదాత ప్రయోజనార్థం పూర్తి స్థాయిలోరూ.45,661 కోట్లతో తీర్చిదిద్దిన బడ్జెట్‌ అని ప్రకటించారు. 1.40 గంటల సేపు బడ్జెట్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. నాలుగేళ్లలో 1.86 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లను అందచేశామని ప్రకటించారు. రూ.1427 కోట్ల రుణాలను రద్దు చేశామని గుర్తు చేశారు.

కేంద్రాలలో వ్యవసాయ వర్తకం

నిర్వహణకు ఏర్పాట్లు.

నియంత్రిత మార్కెట్లలో రైతులు, తయారీ సంస్థలకు ఉత్పాదక రుణాలు. రూ.10 లక్షల వరకు అందించేందుకు నిర్ణయం.

తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కొత్త ఆవిష్కరణకు హరిత విప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌ పరిశోధన నిఽధి కోసం రూ. కోటి కేటాయింపు.

రైతు కూలీలు ప్రమాద వశాత్తు మరణిస్తే ఇచ్చే రూ. లక్ష పరిహారాన్ని రూ. 2 లక్షలకు పెంపు. గాయాల పాలయ్యే వారికి రూ. లక్ష వరకు పంపిణీ.

వ్యవసాయంలో అధిక ఉత్పత్తికి , సాంకేతిక పనితీరుకు గాను మొదటి ముగ్గురు రైతులకు నగదు బహుమతి. మొదటి బహుమతి రూ. 2 లక్షల 50 వేలు. అలాగే, వివిధ 33 రకాల బహుమతులు ప్రదానం లక్ష్యగా రూ. 55 లక్షలు కేటాయించారు. ఉత్తమ సేంద్రీయ రైతుకు నమ్మాళ్వార్‌ అవార్డు. విదేశీ పరిజ్ఞానంపై అవగాహనకు వంద మంది రైతులకు విదేశీ పర్యటనకు అవకాశం.

సభలో వ్యవసాయ బడ్జెట్‌ దాఖలు చేసిన మంత్రి పన్నీర్‌ సెల్వం

రైతు తరహాలో పచ్చ తువాలతో సభకు డీఎంకే సభ్యులు

రూ. 45,661 కోట్ల నిధుల కేటాయింపు డెల్టా యేతర జిల్లాలలో సాగుకు ప్రత్యేక దృష్టి

పాడి ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంపునకు కార్యాచరణ మహిళా జాలర్లకు శిక్షణ

విదేశీ పరిజ్ఞానంపై అధ్యయనానికి టూర్‌ ఇంటి పంటకు తోడ్పాటు

రైతులకు వ్యవసాయ సలహాలు ఇవ్వడం లక్ష్యంగా గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ హోల్డర్లు ద్వారా 1000 సేవా కేంద్రాల ఏర్పాటుకు రూ. 42 కోట్లు కేటాయింపు.

వరి ఉత్పత్తి పెంపునకు రూ. 160 కోట్లు. ఇందులో 102 కోట్లు ప్రపథమంగా డెల్టా యేతర జిల్లాలో 34 లక్షల ఎకరాలలో , మరో రూ. 58 కోట్లతో డెల్టాలో 18 లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తికి నిర్ణయం.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎదురయ్యే కష్టాల నుంచి రైతుకు జీవనోపాధినికల్పించే విధంగా పంట భీమాగా రూ. 841 కోట్లు కేటాయింపు.

2024–25 సీజన్‌లో 1 లక్ష 30 వేలు చెరకు రైతులకు ఒక టన్నుకు గాను రూ. 349 ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు వీలుగా రూ. 297కోట్లు కేటాయింపు.

3 లక్షల ఎకరాల వర్షాధార భూములలో ముందుగానే దుక్కి దున్నడానికి సబ్సిడీగా రూ. 24 కోట్లు.

సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు ను 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అమలు చేయడానికి రూ. రూ. 1,168 కోట్ల కేటాయింపు.

తమిళనాడులో తొలిసారిగా జీడిపప్పు ఉత్పత్తుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు రూ. 10 కోట్లు కేటాయింపు.

రాష్ట్రంలో ప్రపథమంగా 20 రైతు బజార్ల ద్వారా ఆన్‌లైన్‌ డోర్‌ డెలివరి లక్ష్యంగా స్థానిక ఇంటర్నెట్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు.

వ్యవసాయ ఉత్పత్తులకు నల్లూరు వరగు (కుడలూర్‌), వేదారణ్యం ముల్లై (నాగపట్టణం), నత్తం చింతపండు (దిండిగల్‌), ఆయకుడి జామ (దిండిగల్‌), కల్పట్టి చెరకు మునగ(దిండిగల్‌)లకు భౌగోళిక గుర్తింపునకు చర్యలు.

17,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ రంగం యాంత్రీకరణ ప్రాజెక్టుకు రూ. 215 కోట్ల 80 లక్షలు కేటాయింపు.

అటవీ గ్రామాలలోని 63 వేల గిరిజన రైతుల కోసం రూ. 22.80 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టు అమలు.

రూ. 142 కోట్లతో ముఖ్యమంత్రి భూ సంరక్షణ పథకంలో 15 ప్రాజెక్టు అను అదనంగా చేర్చి అమలు చేయడానికి నిర్ణయం.

గ్రామ పంచాయతీలలో 2,338 మంది రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు రూ. 269 కోట్ల 50 లక్షలతో ప్రత్యేక కార్యాచరణ. కలైంజర్‌ ఆల్‌ విలేజ్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌ మెంట్‌ ప్రణాళిక అమలు.

వ్యవసాయ ఉత్పత్తులకు 100 శాతం విలువతో యూనిట్లను ఏర్పాటు చేయడానికి మొదటి దశలో రూ. 50 కోట్లు కేటాయింపు. ఒక్కొ యూనిట్‌కు గరిష్టంగా రూ. 1.50 కోట్లు రాయితీ ఇవ్వనున్నారు.

రూ. 50 కోట్ల 79 లక్షల అంచనా వ్యయంలో 11 చోట్ల వ్యవసాయ ఉత్పత్తి విక్రయ కేంద్రాలలో మౌలిక సదుపాయాల మెరుగుకు చర్యలు.

మొక్కజొన్న రైతులకు ఎక్కువ ఆదాయం లభించే విధంగా 1,87,000 ఎకరాల విస్తీర్ణంలో రూ. 40 కోట్లతో మొక్కజొన్న ఉత్పత్తి అభివృద్ధి ప్రాజెక్టుకు నిర్ణయం.

వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనెలు విత్తనాలు పండించే 90 వేల మంది రైతుల కోసం రూ.108 కోట్లు 6 లక్షలతో నూనె విత్తనాల ఇయక్కం ఏర్పాటు..

తమిళనాడు చిరు ధాన్యాల ఇయక్కం అమలుకు రూ.52 కోట్లు 44 లక్షల కేటాయింపు.

సేంద్రీయ వ్యవసాయం వికేంద్రీకరణకు రూ.12 కోట్లు కేటాయించారు.

పాఠశాల , కళాశాల విద్యార్థుల కోసం వ్యవసాయ పర్యటనలు అవగాహన శిబిరాలకు ప్రోత్సాహకాలు, రిజిస్ట్రేషన్‌ రుసుము మినహాయింపు.

ఆది ద్రావిడ, గిరిజన చిన్న సన్నకారు రైతులకు అదనపు సబ్సిడీ కోసం రూ. 21 కోట్లు కేటాయింపు.

తక్కువ నీటి అవసరాలు ఉన్న పంటలను ప్రోత్సహించండి రూ. 12 కోట్ల 50 లక్షల కేటాయింపుతో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక పథకం అమలుకు నిర్ణయం.

ఆరోగ్యకరమైన పంటల లక్ష్యంగా నాణ్యమైన విత్తనం ఉత్పత్తికి రూ. 250 కోట్లు కేటాయింపు

రూ. 12 కోట్ల 21 లక్షలతో పత్తి ఉత్పత్తి విస్తరణ ప్రణాళిక.

‘తమిళనాడు ఆగ్రోఫారెస్ట్రీ పాలసీ’ ఆవిష్కరణ – చెట్లను పెంచడం, వాటిని నమోదు, అమ్మకం వంటి అన్ని విధానాలను సులభతరం చేయడం లక్ష్యంగా చర్యలు .గ్రీన్‌ తమిళనాడు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ.

రూ. 125 కోట్లతో పోషక వ్యవసాయ మిషన్‌.

ఇంటి తోట కోసం – కూరగాయల విత్తనాలు ,25 లక్షల పండ్ల మొక్కలు. పప్పుధాన్యాలు , ప్యాకేజీ డెలివరీ నిర్ణయం.

4,000 మొబైల్‌ పండ్లు కూరగాయల దుకాణాలకు సబ్సిడీ.

ఇంటిగ్రేటెడ్‌ కొబ్బరి అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.35.26 కోట్లు కేటాయింపు.

రూ. 10. 50 కోట్లతో 130 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాల ఏర్పాటు.

కావేరి, వెన్నారు, వెల్లారు నదీ పరివాహక ప్రాంతాలు, కల్లనైలోని సీ, డీ, ఈ కాలువల పూడికతీతకు నిర్ణయం. మొత్తం 2,925 కి.మీ దూరం పూడికతీతకు రూ.13.80 కోట్ల కేటాయింపు.

ముఖ్యమంత్రి సౌర పంపు సెట్ల పథకానకి రూ. 24 కోట్లు కేటాయింపు. 1000 మంది రైతులకు పంపు సెట్లను అందించేందుకు నిర్ణయం.

వరి, మొక్కజొన్న, అరటి, వేరుశనగ, మినుములు తదితర పంటలకు 1500 ఎకరాలలో విత్తడం నుంచి పంట కోత వరకు సాగులో యాంత్రీకరణ కు రూ. 3 కోట్లుతో (డెమోన్‌ స్టేషన్‌ ప్లాట్స్‌)కు ప్రణాళిక.

రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో 1000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 9 గిడ్డంగులు, అమ్మకాల కేంద్రాల ఏర్పాటుకు చర్యలు.

56 నియంత్రిత అవుట్‌ లెట్లను రూ.39. 20 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ వ్యవసాయ మార్కెట్‌తో కొత్తగా విలీనం చేయనున్నారు. తద్వారా రైతులు జాతీయ స్థాయిలో వర్తకం చేసుకునేందుకు వీలు కల్పించారు. అదనపు ఆదాయం కల్పనకు జాతీయ స్థాయి వర్తకం అమలు.

రూ. 8 కోట్ల విలువైన 50 రైతు బజార్లు అదనపు సౌకర్యాల కల్పన.

ప్రాంతం వారీగా ఎంపిక చేయబడిన వ్యవసాయ ఉత్పుత్తుల సేకరణ

పశువుల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకంతో సహా వ్యవసాయ కార్యకలాపాలకు రైతుల మద్దతు స్వల్పకాలిక రుణ అవసరాల కోసం రూ. 3 వేల కోట్ల మూలధన వ్యయం. పంట రుణాల మాఫీకి రూ.1,477 కోట్ల నిధి. వరి సబ్సిడీకి రూ. 525 కోట్లు నిధి.

10 లక్షల తాటి విత్తనాల పంపిణీకి నిర్ణయం, ఊటీలో రిసార్ట్‌ల నిర్మాణ పథకానికి బ్రేక్‌ వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

మత్స్యసంపద పెంపునకు ప్రత్యేక కార్యాచరణ. నీటి వనరులలో చేపల ఉత్పాదకతను పెంచే విధంగా ఒక పంచాయతీలోని 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెరువులో 2 వేల చేపల పిల్లల పంపిణికి చర్యలు. మహిళా జాలర్లు 1000 మందికి నైపుణ్యాల అభివృద్దిలో శిక్షణ. 10 వేల మంది జాలర్లకు వ్యవసాయ రుణ కార్డుల పంపిణీ.

42 వేల ఎకరాలలో రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల మధురై మల్లి ఉత్పత్తి లక్ష్యం. మదురై, ధర్మపురి, తిరువళ్లూరు, సేలం, దిండుగల్‌, తిరువణ్ణామలై, కృష్ణగిరి , ఈరోడ్‌లలో మల్లె పువ్వల ఉత్పత్తికి కార్యాచరణ. 7 వేలమంది మల్లె సాగు రైతుల కోసం రూ. 60 లక్షలు కేటాయింపు. తిరువణ్ణామలై, సేలం, దిండుగల్‌, తిరుప్పత్తూర్‌లలో గులాబీల సాగును ప్రోత్సహించేందుకు రూ. కోటి కేటాయింపు.

No comments yet. Be the first to comment!
Add a comment
అన్నదాతపై.. వరాల జల్లు 1
1/3

అన్నదాతపై.. వరాల జల్లు

అన్నదాతపై.. వరాల జల్లు 2
2/3

అన్నదాతపై.. వరాల జల్లు

అన్నదాతపై.. వరాల జల్లు 3
3/3

అన్నదాతపై.. వరాల జల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement